https://oktelugu.com/

AP DSC Notification : చివరి నిమిషంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా..ఏం జరిగిందంటే?*

ఏపీలో 13336 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.తొలి ఫైల్ గా సంతకం చేసిన చంద్రబాబు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.కానీ రోజురోజుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 6, 2024 / 01:51 PM IST

    AP DSC 2024

    Follow us on

    AP DSC Notification :  అనూహ్య నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎన్నికల సందర్భంగా భారీగా హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి ఫైల్ పై సంతకం చేశారు. ఈరోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని ప్రచారం కూడా జరిగింది. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మారినట్లు తెలుస్తోంది. ఈరోజు విడుదల చేయాల్సిన మెగా డీఎస్సీ ప్రకటనను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అనివార్య కారణాలతో నోటిఫికేషన్ ప్రకటన వాయిదా పడినట్లు అధికారులు చెబుతున్నారు. మరో నాలుగు ఐదు రోజుల్లో జారీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. మెగా డీఎస్సీ నిర్వహణపై మంత్రి లోకేష్ సమీక్షించారు. డీఎస్సీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీఎస్సీలో సాధ్యమైనంత ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన చెబుతున్నారు.

    * ఆ హామీలతో జగన్
    2019 ఎన్నికల్లో జగన్ భారీగా హామీలు ఇచ్చారు. ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కానీ నాలుగు సంవత్సరాల కాలం గడిపేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు 6000ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు.అయితే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 13336 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలి ఫైల్ పై సంతకం చేశారు. అయితే టెట్ నిర్వహణ తర్వాత డీఎస్సీ ప్రక్రియకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నెల నాలుగున టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. దీంతో డీఎస్సీ ప్రకటన ఉంటుందని అంతా భావించారు.

    * డిసెంబర్ నాటికి ప్రక్రియ పూర్తి
    ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా 12 వేల పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయి. ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉంది. డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తే.. కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎటువంటి అడ్డంకులు, న్యాయ చిక్కులు లేకుండా డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.అందుకే ఇప్పుడు డీఎస్సీనోటిఫికేషన్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. సమగ్ర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నాలుగైదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన వస్తుందని తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.