Land values AP : ఏపీ ప్రభుత్వం దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూచర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో అడ్డగోలుగా మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ల విలువలపై కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది. వైసిపి హయాంలో భూముల విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది అశాస్త్రీయంగా ఉన్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత వైసిపి పాలకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేసినట్లు విమర్శలు ఉన్నాయి. అటువంటి చోట తిరిగి వాస్తవ పరిస్థితులు ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. వారిచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేయనున్నారు.
* 20న ప్రతిపాదనల ప్రదర్శన
ఈనెల 20వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతిపాదనలకు సంబంధించి నోటీసులను ప్రదర్శిస్తారు. 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న తుది పరిశీలన చేస్తారు. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తెస్తుంది. అయితే ఇప్పుడున్న విలువకు 10 నుంచి 15% పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
* ఆ భూముల రిజిస్ట్రేషన్లు నిషేధం
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటిన డీ పట్టా భూములను విక్రయించేందుకు వైసిపి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకుగాను ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. అయితే ఇది ముందస్తు వ్యూహంతోనే వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు భారీగా డీ పట్టా భూములను కొనుగోలు చేసినట్లు తేలింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి విక్రయాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. కొద్దిరోజులపాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఒకవైపు దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా భూముల విలువ పెంచేందుకు నిర్ణయించడం విశేషం.