Amaravati: అమరావతి రాజధానిపై ( Amravati capital ) ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతిలో భూసేకరణ పై ఫోకస్ చేసింది. రైతులు ఇవ్వని భూములను సేకరించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ భూములను ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా సేకరించనున్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని వర్తింపజేయనున్నారు. గతంలో నోటిఫై చేసిన 343.36 ఎకరాల భూసేకరణను ఉపసంహరించి.. కోర్టు కేసులను పరిష్కరించడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ఈ లెక్కన 2800 ఎకరాల భూమి ఇంకా సమీకరణలు ఇవ్వాల్సి ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
* భూమి ఇవ్వకపోవడంతో పెండింగ్..
అమరావతి రాజధానికి సంబంధించి భూ సమీకరణలో కొంత భూమి ఇవ్వకపోవడం వల్ల.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు స్థలాల కేటాయింపు వంటి పనులు ఆగిపోతున్నాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతోంది. ఎప్పటికీ రాజధాని అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల అమలు కోసం కంపెనీల చట్టం కింద ఒక ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుకు పొరపాలక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ ఇప్పటికే నిర్ణయించిన ఎనిమిది ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రాజెక్టులు కూడా నిర్వహించనుంది. 10 కోట్ల రూపాయల షేర్ క్యాపిటల్ తో ప్రారంభం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉండనున్నారు.
* వీటి నిర్మాణం..
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం( Greenfield airport ), నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీలు, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్ వే, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నాయి. ఇవన్నీ అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక పాత్ర పోషించేవే. అమరావతిని ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంలో ఈ సరికొత్త విధానం కీలక పాత్ర పోషించనుంది.