Kurnool Man Cheated: మంత్రాలకు చింతకాయలు రాలవు. రాత్రికి రాత్రే డబ్బులు వచ్చి ఖాతాలో పడవు.. ఉత్తి పుణ్యానికి బంగారం నిలువలు ఇంట్లోకి రావు. కఠినమైన రోగాలు ఒకరు మంత్రం వేస్తే తగ్గిపోవు.. ఇవన్నీ తెలిసినప్పటికీ.. చాలామంది మూఢనమ్మకాలను నమ్ముతుంటారు. నిండా మునిగిపోతుంటారు. వాస్తవానికి మూఢనమ్మకాలను నమ్మకూడదని తెలుసు. వాటిని నమ్మితే మోసపోతామని కూడా తెలుసు. అయినప్పటికీ చాలామంది ఏదో ఒక బలహీన క్షణంలో మూఢనమ్మకాలను నమ్ముతుంటారు. నిండా మునిగిపోతుంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి గ్రామంలో ఓ దారుణం జరిగింది. క్షుద్ర పూజల పేరుతో భయపెట్టి 3.50 కోట్లను కొట్టేశాడు ఓ వ్యక్తి. పైగా తనను తాను గురువుగా చెప్పుకున్నాడు. దీనిపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బాధితులు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెబ్బేరులో వెంకటయ్య, పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బైచిగేరి ప్రాంతానికి చెందిన దుర్గా సింగ్ అనే వ్యక్తికి దేవుడు అవహిస్తాడని.. అక్కడికి వెళ్తే ఆరోగ్యం బాగుంటుందని కొంతమంది చెప్పారు. దీనిని నిజమని నమ్మిన వెంకటయ్య పద్మ దంపతులు అక్కడికి వెళ్లారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దుర్గా సింగ్ అనేక కట్టుకథలు చెప్పాడు.. మీ పొలంలో గుప్తనిధి ఉందని.. దానిని బయటకు తీసేంతవరకు మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంటుందని హెచ్చరించాడు. పూజల పేరుతో 80 లక్షలు దోచేశాడు.
ఒకరోజు రాత్రి దుర్గా సింగ్ వెంకటయ్య దంపతుల స్వగ్రామమైన ఉండవల్లి గ్రామంలోని శివారు ప్రాంతంలో క్షుద్ర పూజలు చేశాడు. అనంతరం అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని మూడు అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని వారికి చూపించాడు. ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉంటుందని..దానిని అమ్మేస్తే కోట్ల వరకు వస్తాయని వారిని నమ్మించాడు. ఆ విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి ఇతర దేశాల నుంచి చాలామంది వచ్చారని.. వారు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని వెంకటయ్య దంపతులకు మాయమాటలు చెప్పాడు. అనేకసార్లు వారిని ఢిల్లీ తీసుకెళ్లాడు. ఇలా అనేక పర్యాయాలు వారి వద్ద నుంచి 3.50 కోట్లు వసూలు చేశాడు.
దుర్గా సింగ్ వ్యవహార శైలి పై అనుమానం వచ్చిన వెంకటయ్య దంపతులు.. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని అతడిని కోరాడు. దీంతో దుర్గా సింగ్ వారిని బెదిరించాడు. చంపేస్తానని హెచ్చరించాడు. దీనిపై బాధితులు పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. గత నెలలో ఆదోని ప్రాంతానికి వచ్చిన వారు డిఎస్పి తో పాటు సీఐ కి కూడా ఫిర్యాదు చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి ఆదోని డిఎస్పీ తో మాట్లాడారు. సరైన సాక్షాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డిఎస్పి ఎమ్మెల్యేకు వివరించారు.