Kurnool Bus Fire Accident: కర్నూలులో ఇటీవల చోటు చేసుకున్న బస్సు ప్రమాదానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత బైకర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తుంటే బస్సు డ్రైవర్, బైకర్ కాకుండా ప్రమాదానికి మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
కర్నూలులో వేమూరి కావేరి సంస్థకు సంబంధించిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది చూస్తుండగానే చనిపోయారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడం.. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనం నడిపిన శివశంకర్ ఆరోజు తెల్లవారుజామున 2:45 నిమిషాలకు డివైడర్ ను ఢీకొట్టాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతడు నడిపిన బండి రోడ్డు మధ్యలో పడింది. వేమూరి కావేరి సంస్థకు సంబంధించిన బస్సు అదే రోజు తెల్లవారుజామున రెండు గంటల 55 నిమిషాలకు ఆ బైకును ఢీ కొట్టింది. అయితే ఈ మధ్యలో దాదాపు 19 వాహనాలు రోడ్డు మీద పడి ఉన్న బైకును తప్పించుకుని వెళ్లాయి. ఎవరు కూడా ఆ బైకును పక్కకు జరపాలని అనుకోలేదు.
వాస్తవానికి రోడ్డు మధ్యలో బైక్ పడి ఉన్నప్పటికీ కావేరి ట్రావెల్స్ బస్సు తోలిన డ్రైవర్ కు అది కనిపించలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ” ఆ ద్విచక్ర వాహనం నడిపిన వాడికి సోయి లేదు.. విపరీతంగా మద్యం తాగి వాహనం నడిపాడు. డివైడర్ ను ఢీ కొట్టి దుర్మరణం చెందాడు. కనీసం ఆ బైక్ ను పక్కకు జరపాలని ఎవరికీ అనిపించలేదు. దీంతో ఆ బైక్ రోడ్డు మధ్యలో అలానే ఉంది. చివరికి అది కావేరి ట్రావెల్స్ బస్సు తోలుతున్న డ్రైవర్ కు కూడా కనిపించలేదు. అంత పెద్ద బైక్ కనిపించలేదా? ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో అలానే నడిపాడా? ఏది ఏమైనప్పటికీ బైకర్ నిర్లక్ష్యం.. బస్సు డ్రైవర్ ముర్కత్వం కలసి 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 20 మంది కుటుంబాలలో ఊహించని విషాదం ఏర్పడింది. వారు లేని లోటు ఎవరు తీర్చుతారు. వారి ప్రేమను ఎవరు అందిస్తారని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సమాజంలో రోజురోజుకు సేవా తత్పరత అనేది లేకుండా పోతోంది. ఎవడు ఏమైపోతే నాకేంటి.. నా సెక్యూరిటీ నాకు ఉంటే సరిపోతుందని జనాలు అనుకుంటున్నారు. అందువల్లే ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఘోరాలు చోటు చేసుకున్నా పట్టనట్టు ఉంటున్నారు. కర్నూలు ఘటన లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు సమాజంలో చోటు చేసుకుంటున్న పెడ పోకడలకు దర్పణంగా నిలుస్తున్నాయి.