Mantha Cyclone: ఏపీకి( Andhra Pradesh) పెను ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడింది. తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది. ఈరోజు సాయంత్రానికి, లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటి అవకాశం ఉంది. మరో 18 గంటలు రాష్ట్రం ప్రమాదపు అంచున ఉంటుంది. ముఖ్యంగా కోస్తాకు అత్యంత భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈదురు గాలులు సైతం వీస్తున్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది. మరోవైపు కేంద్రం సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. నిన్ననే సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వపరంగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంకోవైపు భారీ వర్షాల నేపథ్యంలో రైళ్లతో పాటు విమాన సర్వీసులను రద్దు చేశారు.
* ఉత్తర కోస్తాలో అలజడి..
మొంథా తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో( North coastal ) తీవ్ర అలజడి రేగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్రవాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుఫానుగా బలపడింది. సోమవారం సాయంత్రానికి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450 కిలోమీటర్లు, విశాఖకు 500 కిలోమీటర్లు, ఒడిస్సా గోపాల్ పూర్కు 670 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి ప్రచండ తుఫాన్ గా మారింది. మంగళవారం 18 గంటలపాటు దీని తీవ్రత కొనసాగనుంది. తరువాత బలహీనపడి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాన్ తీరం దాటిన సమయంలో 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీరుస్తాయని చెబుతోంది.
* మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం..
గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం( state government) ముందే మేల్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగిపడే అవకాశం ఉండడంతో.. సరఫరా పునరుద్ధరణ కోసం వెయ్యి ప్రత్యేక బృందాలతో.. 1200 మంది సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరోవైపు ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో 2194 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. మరోవైపు తుఫాను ప్రభావం ఉన్న 12 జిల్లాల్లో రేషన్ డిపోల ద్వారా మంగళవారం నుంచి సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విశాఖ, విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం రద్దు చేశారు. కొన్ని విమాన సర్వీసులను సైతం రద్దు చేశారు. అయితే తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర పై కనిపిస్తోంది. భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
* ఆకస్మిక వరదలు..
ఆకస్మిక వరదలు( floods ) వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఏపీని హెచ్చరించింది. ప్రధానంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఆకస్మిక వరదలు ఉంటాయని అప్రమత్తం చేసింది. సముద్రం అత్యంత అలజడిగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. కాకినాడ మచిలీపట్నం పోర్టులకు నాలుగో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మరోవైపు కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు కోర్టులకు మూడో నెంబర్ ప్రమాద జారీ అయ్యాయి.