Kurnool Bus Fire Accident: ఏపీలో( Andhra Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. 20 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు చెబుతున్నారు. 12 మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
కావేరి ట్రావెల్ బస్సు( Kaveri travel bus ) కర్నూలు నగర శివారులోని ఉలిందకొండ సమీపంలో వెళ్తుండగా ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకు దూసుకుపోయి ఆయిల్ ట్యాంకర్ ను తాకడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సుకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన 12 మంది ప్రయాణికులు బస్సు అద్దాలను ధ్వంసం చేసుకుని కిందకు దూకేశారు. అయితే మిగిలిన వారు మాత్రం మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే మృతుల్లో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు తెలుస్తోంది.
* ప్రమాదం నుంచి బయటపడిన వారిలో రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్ కుమార్, అఖిల్, జస్మిత, అకిరా, రమేష్, జయ సూర్య, సుబ్రహ్మణ్యం తదితరులు.
* దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) స్పందించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సైతం విచారణ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్లు ఇద్దరూ అక్కడ నుంచి పరారీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడుని సైతం గుర్తించినట్లు సమాచారం.