Pamarru Bus Stand Named NTR: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఓ బస్ స్టాండ్ కు ఎన్టీఆర్ పేరు పెట్టింది. కృష్ణా జిల్లా పామర్రు బస్టాండ్ కు నందమూరి తారక రామారావు ప్రయాణ ప్రాంగణంగా పేరు మార్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పామర్రు నియోజకవర్గ ఎమ్మెల్యేగా.. వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చిన విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. ఎన్టీఆర్ కు ఘన నివాళి అని.. 39 సంవత్సరాల తర్వాత బస్టాండ్ కు ఆయన పేరు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఈ బస్టాండ్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. నాలుగు దశాబ్దాల కిందట ఈ బస్టాండ్ ను నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నిర్మించడం విశేషం.
* జాతీయ రహదారి చెంతనే..
విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై( National Highway) ఉంటుంది ఈ బస్టాండ్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. 1986లో ఈ బస్టాండ్ ను నిర్మించారు. నాలుగు దశాబ్దాలు కావడంతో ఈ బస్టాండ్ పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక బస్టాండ్ కు మరమ్మత్తులు చేయించారు. ఎన్టీఆర్ సొంత గడ్డ కావడంతో ఆయన పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పాటు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.
* ఎన్టీఆర్ సొంత ప్రాంతం..
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు( nimmakuru ). పామర్రు నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పామర్రు బస్టాండ్ ను నిర్మించారు. అయితే ఈ బస్టాండ్కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. అది ఎన్నాళ్లకు సాకారం అయ్యింది. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట ప్రత్యేక జిల్లాను ప్రకటించింది. దానినే గొప్పగా ప్రచారం చేసుకుంది. కృష్ణా జిల్లాను రెండుగా విభజించి కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.