Kodali Nani Re-Entry: మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani) వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించిన కోటి సంతకాల సేకరణకు హాజరయ్యారు. మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. తద్వారా తాను రాజకీయాలకు విడిచిపెట్టి వెళ్ళబోనని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు పూర్తిస్థాయిలో గుడివాడ నియోజకవర్గం పై కొడాలి నాని దృష్టి పెడతారని తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఎలా పావులు కదుపుతుంది అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. నాని యాక్టివ్ అయిన మరుక్షణం అరెస్ట్ ఉంటుందని ప్రచారంలో ఉంది.
దూకుడుకు మూల్యం తప్పదా?
కొడాలి నాని చాలా దూకుడు కలిగిన నాయకుడు. అయితే అది రాజకీయంగా కంటే వ్యక్తిగతంగానే. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కన్ను మిన్ను కాన రాలేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట తూటా కంటే డేంజర్ గా ఉండేది. సొంత పార్టీ వారు ఎంతగానో ఆనందం పొందే వారు. కానీ ప్రత్యర్ధులు మాత్రం బూతులుగా చూసేవారు. తటస్తులతోపాటు విద్యాధికులు తప్పుపట్టేవారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొడాలి నాని లాంటి వారు చేసిన వ్యాఖ్యలు కారణమన్న కామెంట్స్ వినిపించాయి. అందుకే ఈసారి కొడాలి నాని కి జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వరని ప్రచారం నడిచింది. మరోవైపు కొడాలి నాని కి ప్రత్యామ్నాయంగా మరో నేతను రంగంలోకి దించుతారని కూడా టాక్ నడిచింది.
ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు..
కొడాలి నాని అరెస్ట్ కోసం టిడిపి శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. గతంలో లోకేష్ ఇదే కొడాలి నానిని ఉద్దేశించి.. అరెస్ట్ చేసి రోడ్డుమీద తీసుకెళ్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కొడాలి నాని మాదిరిగా వ్యాఖ్యానాలు చేసే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు ఎప్పుడో జరిగిపోయింది. సుదీర్ఘకాలం ఆయన జైల్లోనే ఉండిపోయారు. ఆ వంతు కొడాలి నాని కి ఎప్పుడు వస్తుందా అని సగటు టిడిపి అభిమాని ఎదురుచూస్తూ వచ్చారు. అయితే కొద్ది రోజుల కిందట గుండెపోటుకు గురయ్యారు కొడాలి. ముంబాయిలోని ప్రఖ్యాత ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ చేసుకున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని అక్కడి వైద్యులు సూచించారు. అందుకే ఇంటికే పరిమితమయ్యారు కొడాలి నాని. కానీ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. సంక్రాంతి తర్వాత గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. అయితే నాని యాక్టివ్ అయిన మరుక్షణం అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. అందుకే ఇదో హాట్ టాపిక్ గా మారింది.