Kodali Nani Is Back: మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈరోజు ఆయన గుడివాడలో జరిగిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి పొలిటికల్ గా యాక్టివ్ అవుతానని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు ప్రయత్నిస్తానని కూడా ప్రకటన చేశారు. తద్వారా కూటమికి స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. తన విషయంలో దేనికైనా సిద్ధం అని పరోక్షంగా చెప్పుకొచ్చారు నాని. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొడాలి నాని కనిపించలేదు. కానీ అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చేవారు. వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలో తరువాత మీదేన అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. అయితే తర్వాత కొడాలి నాని అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో మహారాష్ట్రలో చికిత్స చేసుకున్నారు. తరువాత హైదరాబాద్కు పరిమితమయ్యారు. అయితే ఇటీవల అప్పుడప్పుడు బయటకు కనిపిస్తూనే ఉన్నారు కానీ.. అనారోగ్యంతో ఉన్నట్టు ఆయన శరీర ఆకృతి ఉంది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి గుడివాడ వచ్చారు. మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని ప్రకటించారు.
వెంటాడి వేటాడి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో దూకుడుగా ఉండేవారు నాని. కాను గుడివాడ ఎమ్మెల్యేగా, మంత్రిగా కాకుండా చంద్రబాబుపై విమర్శలు చేసేందుకే అన్నట్టు వ్యవహరించేవారు. లోకేష్ పై సైతం నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. పవన్ కళ్యాణ్ పై సైతం అదే స్థాయిలో ప్రవర్తించేవారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విభేదించే ప్రతి ఒక్కరిని వ్యతిరేకించేవారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి పై కూడా నోరు పారేసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన తమిళ మెగాస్టార్ రజనీకాంత్ ను కూడా వదల్లేదు. ఆయన శరీర ఆకృతి పై సైతం మాట్లాడారు. అయితే అప్పట్లో కొడాలి నాని వ్యవహరించిన తీరుపై కూటమి వచ్చాక పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం ఆ కేసుల్లో నాని అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.
టిడిపి శ్రేణుల అభిప్రాయం అదే..
కొడాలి నాని విషయంలో టిడిపి శ్రేణులు ప్రత్యేక అభిప్రాయంతో ఉంటాయి. కూటమి వచ్చిన తరువాత నాని అరెస్ట్ ఎప్పుడూ ఉంటుందా అని ఆరా తీసేవారు ఎక్కువ. అంతలా టిడిపి శ్రేణులతో పాటు ఆ పార్టీని ఇబ్బంది పెట్టారు కొడాలి నాని. మాటలతో గాయం కూడా చేశారు. అందుకే ఎక్కువమంది కొడాలి నాని అరెస్టు కావాలని కోరుతున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని సైతం లోపలకు వెళ్తారని అంతా భావించారు. కానీ మధ్యలో ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొడాలి నాని అరెస్టు జరగలేదు. ప్రస్తుతం నారా లోకేష్ అమెరికాలో ఉన్నారు. అక్కడ సైతం కొడాలి నాని గురించి కొంతమంది అడిగినట్లు తెలుస్తోంది. అయితే లోకేష్ ఏం చెప్పారో కానీ.. త్వరలో నాని అరెస్టు ఉంటుందని మాత్రం అమెరికాలో సైతం ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఈరోజు కోటి సంతకాల సేకరణలో కొడాలి నాని పాల్గొన్నారు. రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని చెప్పడం ద్వారా తనకు అరెస్టు భయం లేదని సంకేతాలు ఇవ్వగలిగారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?