Kesineni Nani Grand re-entry: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలన పూర్తి చేసుకుంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కొందరు నేతలు సైతం తమ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని వార్తలు వస్తున్నాయి. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? పూర్వాశ్రమం అయిన టిడిపిలో చేరుతారా? లేకుంటే బీజేపీలో చేరుతారా? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి..
ప్రజారాజ్యం( Praja Rajyam ) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేసినేని నాని. ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉండే నాని కేసినేని పేరిట బస్సులు నడిపేవారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా మారారు. 2014లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం నిలబడగలిగారు నాని. అలా రెండోసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఆయన లోకల్ రాజకీయాల పుణ్యమా అని తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి క్రమేపి దూరమయ్యారు. అదే సమయంలో ఆయన సోదరుడు చిన్ని ఆ దూరాన్ని క్యాష్ చేసుకున్నారు. టిడిపి నాయకత్వంతో సఖ్యతగా మెలిగారు.. అలా అన్న దూరమైతే ఆ స్థానాన్ని తమ్ముడు భర్తీ చేశాడు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కేసినేని నాని. అయితే ఆ ఎన్నికల్లో సొంత తమ్ముడు చిన్ని చేతిలో దారుణంగా ఓడిపోయారు. అయితే చేజేతులా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నానని భావించారో.. లేకుంటే నమ్ముకున్న వారే నష్టపరిచారని బాధపడ్డారో తెలియదు కానీ.. ఫలితాలు వచ్చాక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు కేసినేని నాని.
స్థానిక రాజకీయాలతోనే..
అయితే ఇప్పుడు అదే కేసినేని నాని( Kaisineni Nani) పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి నాని దూరం కావడం వెనుక చాలా రకాల కారణాలు ఉన్నాయి. లోకల్ పాలిటిక్స్ ఒకవైపు.. తన తమ్ముడు చిన్ని మరో వైపు అన్నట్టు పరిస్థితి మారడంతో నాని ఇబ్బంది పడ్డారు. మరోవైపు రెండోసారి ఎంపీగా గెలిచేసరికి నాని లో ఒక రకమైన నమ్మకం ఏర్పడింది. తన సొంత బలంతోనే గెలిచానన్న ధీమావ్యక్తమైంది. ఇంతలో మిగతా నేతలతో ఇబ్బంది రావడంతో.. వారి వెనుక నాయకత్వం ఉందని అనుమానానికి గురయ్యారు. అలా అలా క్రమేపి పార్టీకి దూరమయ్యారు. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్రావ్య పోటీ చేశారు. కానీ కొంతమంది పని కట్టుకొని ఆమెను ఓడించేందుకు సిద్ధపడ్డారని నాని అనుమానపడ్డారు. హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇది కూడా నాని పార్టీ మారేందుకు ఒక కారణంగా నిలిచింది.
ఇప్పటికీ టిడిపిలో సాఫ్ట్ కార్నర్..
అయితే తప్పనిసరి పరిస్థితుల్లో కేసినేని పార్టీ మారారే తప్ప.. పూర్తిస్థాయిలో వైసీపీ పై అభిమానంతో వెళ్లలేదు. ఇప్పటికీ ఆయన పట్ల టిడిపి క్యాడర్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే తిరిగి ఆయన టిడిపిలో చేరాలనుకున్న వారు ఎక్కువ. పైగా కేసినేని నానితో పోల్చుకుంటే చిన్ని కలుపు కెళ్లే మనస్తత్వం తక్కువ. ఈ కారణాలతో కేశినేని నాని తిరిగి టిడిపిలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే టిడిపి నుంచి సానుకూలత వ్యక్తం అయితే ఆయన కుమార్తె తిరిగి పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గతం మాదిరిగా ఆమెను మేయర్ గా పేరు ప్రకటిస్తే.. అందుకు టిడిపి నాయకత్వం ఒప్పుకుంటే మాత్రం కేసినేని నాని రీఎంట్రీ ఖాయమని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.