Kiran Royal: జనసేన నేత కిరణ్ రాయల్( Kiran Royal ) వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. జనసేనకు సమస్యగా మారుతోంది. కిరణ్ రాయల్ పై వస్తున్న ఆరోపణలతో వైసిపి విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వీడియోలు వైరల్ చేస్తోంది. అయితే దీనిపై ఇప్పటికే కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు. కానీ వివాదం మాత్రం సద్దుమణగలేదు. దీంతో ఈ వివాదం పై పవన్ ఎటువంటి చర్యలకు దిగబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుపతికి చెందిన జనసేన నేత కిరణ్ రాయల్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే ఆ వివాదం పై మాట్లాడారు కిరణ్ రాయల్. అయినా సరే వైసీపీ వెనక్కి తగ్గడం లేదు.
* సెల్ఫీ వీడియో సంచలనం
తనను కిరణ్ రాయల్( Kiran Royal ) మోసం చేసి కోటి రూపాయలకు పైగా కాజేసారని తిరుపతి బైరాగపుట్టడుగు కు చెందిన మహిళ ఆరోపించారు. ఆ మహిళ ఆత్మహత్యాయత్నం కూడా సంచలనం రేపింది. ఈ వీడియో పై స్పందించిన కిరణ్ రాయల్ అప్పట్లో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి వివరణ ఇచ్చారు. అయితే కిరణ్ రాయల్ తనకు కోటి 20 లక్షల రూపాయల మేర నగదు ఇవ్వాలని సదరు మహిళ చెబుతున్నారు. తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. డబ్బు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చింది సదరు బాధిత మహిళ. వైసిపి దీనిని ప్రచార అస్త్రంగా మార్చుకుంది. పైగా వైసిపి నేతలపై అవకాశం చిక్కినప్పుడల్లా కిరణ్ రాయల్ విమర్శలు సంధిస్తుంటారు. అందుకే ఇప్పుడు ఆయన వైసీపీకి టార్గెట్ అయ్యారు.
* వైసీపీ కుట్ర
అయితే దీనిపై కిరణ్ రాయల్ వేరే విధంగా చెబుతున్నారు. వైసిపి( YSR Congress ) చేసిన కుట్రగా అభివృద్ధి చేస్తున్నారు. ఆ మహిళపై చాలా కేసులు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఆ మహిళా చాలామందిని ముంచేస్తుందని.. చాలా కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారని వివరించారు. అయితే ఇదే సమయంలో కిరణ్ రాయల్ మహిళతో మాట్లాడిన ఆడియో.. కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. జనసేన శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే దీని వెనుక వైసిపి కుట్ర ఉందన్నది జనసేన అనుమానం. అయితే నేరుగా ఆడియోలు, వీడియోలు ఉండడంతో జనసేన ఆందోళనలో పడింది.
* చర్యలు తీసుకుంటారా
అయితే జనసేన లో ఇటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో జనసేన ఇలానే స్పందించింది. అయితే ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan) స్పందించరా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై ఇటువంటి లైంగిక వేధింపు బయటపడింది. వెంటనే ఆయన పై సస్పెన్షన్ వేటు వేశారు. అదే మాదిరిగా కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాలి.