Kilaru Rosaya : వైసీపీకి మరో కుటుంబం షాక్.. అందరూ కలిసికట్టుగా జనసేనలోకి..

ఏపీలో సీనియర్ నేతల్లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒకరు. వైసీపీలో యాక్టివ్ గా పని చేసిన ఆయన నెంబర్ 2 అవుతారని అంతా భావించారు. ఆయన సీనియార్టీ కి తగిన పదవి దక్కుతుందని అంచనా వేశారు. కానీ జగన్ కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆ సీనియర్ నేత కుటుంబం వైసీపీకి గుడ్ బై చెప్పింది.

Written By: Dharma, Updated On : September 21, 2024 4:04 pm

Kilaru Rosaya

Follow us on

Kilaru Rosaya :ఏపీలో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీకి ఘోర పరాజయం తర్వాత నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. సన్నిహిత నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో మరో కుటుంబం షాక్ ఇచ్చింది. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య జనసేనలో చేరనున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేశారు. నేడు ఆయన డిప్యూటీ సీఎం పవన్ ను కలిశారు. ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రేపు మంచి రోజు కావడంతో జనసేనలో చేరనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వారందరితో పాటు కిలారి రోశయ్య సైతం జనసేనలో జాయిన్ కానున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి ఇది ఎదురుదెబ్బే. కిలారి రోశయ్య జనసేనలో చేరుతుండడంతో.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

* వైసీపీలో చాలా యాక్టివ్
వైసిపి ఆవిర్భావం నుంచి ఉమ్మారెడ్డి కుటుంబం సేవలందిస్తోంది. జగన్ వెంట అడుగులు వేసింది. అప్పటివరకు సుదీర్ఘకాలం ఉమారెడ్డి వెంకటేశ్వర్లు టిడిపిలో కొనసాగారు. వైసీపీ ఏర్పాటు సమయంలో చాలా యాక్టివ్ గా పని చేశారు. 2014 ఎన్నికల్లో సైతం విశేష సేవలు అందించారు. 2019 ఎన్నికలకు ముందు నవరత్నాలు, ఎన్నికల హామీల రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. ఆయన అందించిన సేవలు, సీనియార్టీని కనీసం గుర్తించలేదు.

* మంత్రి పదవి ఆశించినా
కాపు సామాజిక వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంత్రి పదవి ఆశించారు. కానీ అదే సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, ఆళ్ల నాని వంటి వారికి మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. కనీసం శాసనమండలి ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించలేదు. తొలుత శాసనమండలి చైర్మన్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ మోషేన్ రాజుకు పదవి ఇచ్చారు. తాజాగా లేళ్ళ అప్పి రెడ్డికి శాసనమండలిలో విపక్ష నేత పదవి ఇచ్చారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిని నిరసిస్తూ ఆయన అల్లుడు, మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఉమ్మారెడ్డికి ఎమ్మెల్సీ పదవీకాలం ఉండడంతో.. ఆయన ఇటువైపు రాలేదని తెలుస్తోంది.

* ఎన్నికల ముందు నుంచే అసంతృప్తి
ఈ ఎన్నికలకు ముందు నుంచి ఉమ్మారెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉంది. ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరు ప్రకటించారు. కానీ ఉమ్మారెడ్డి మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ ఆ సీటును సిట్టింగ్ మంత్రి విడదల రజినీకి కేటాయించారు. మరోవైపు పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న కిలారు రోశయ్యను తెచ్చి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. ఇవన్నీ ఉమ్మారెడ్డి కుటుంబానికి మనస్థాపానికి గురిచేశాయి. అందుకే వైసీపీని వీడాలని ఆ కుటుంబం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కిలారు రోశయ్య, ఆయన వియ్యంకుడు రవిశంకర్ జనసేనలో చేరారు. మున్ముందు ఉమ్మారెడ్డి కుటుంబం సైతం చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.