AP Excise Policy: ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లుగా అమలులో ఉన్న మద్యం పాలసీని రద్దు చేయాలని కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కార్ నిర్ణయించింది. గత మద్యం పాలసీ కారణంగా, నాసిరకం మద్యం అమ్మారని, దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని కూటమి ప్రభుత్వం భావించింది. దీంతో పాలసీ మార్చాలని, ప్రజలకు నాణ్యమైన మద్యంతోపాటు అడిగిన బ్రాండ్ లేదనకుండా మద్యం అందించాలని నిర్ణయించింది. ఇందు కోసం కొత్త మద్యం పాలసీ అమలు చేయడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీని అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా కొత్త మద్యం పాలసీని రూపొందించింది. ఈమేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బుధవారం(సెప్టెంబర్ 18న) జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అక్టోబర్ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తారని తెలుస్తోంది.
ధరల తగ్గింపు.. క్వాలిటీ లిక్కర్..
ఇక కొత్త మద్యం పాలసీ ప్రకారం.. ఏపీలో మద్యం ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. గత ప్రభుత్వం మద్య నిషేధం పేరిట భారీగా ధరలు పెంచిందని,నాసిరకం మద్యం అందించిందని మంత్రివర్గ ఉప సంఘం భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అమలు చేసే కొత్త పాలసీలో మద్యం ధరలు తగ్గించడంతోపాటు, ప్రజలకు కావాల్సిన అన్ని బ్రాండు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఇప్పటి వరకు అమ్ముతున్న బూం బూం బీర్లకు ఇక కాలం చెల్లినట్లే.
ఇప్పటికే నిలిపివేత..
తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని, ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఈమేరకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి కొత్త మద్యం పాలసీ తయారు చేయించింది. మరోవైపు ఏపీలో ఐదేళ్లుగా విక్రయిస్తున్న బూం బూం బీర్లను ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. నాసిరకం మద్యంతో ప్రజారోగ్యం దెబ్బతిన్నట్లు కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది.