MLA Vasantha Krishna Prasad: వైసీపీ ఎమ్మెల్యే జనసేనలో చేరనున్నారా? ఆ పార్టీ నుంచి పోటీ చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కృష్ణాజిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా వైసీపీ హై కమాండ్ పై అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయనని కూడా తేల్చి చెప్పారు. దీంతో వైసిపి అక్కడ ప్రత్యామ్నాయ నాయకుడిని వెతుక్కుంది. మైలవరం జడ్పిటిసి స్వెర్నాల తిరుపతిరావును ఇన్చార్జిగా నియమించింది. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ తన భవిష్యత్ కార్యాచరణ పై దృష్టి పెట్టారు. ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
వైసిపి ఆరో జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో మైలవరం అభ్యర్థిని సైతం జగన్ ప్రకటించారు. తిరుపతిరావును ఖరారు చేశారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. కేశినేని నాని, జోగి రమేష్ తో భేటీ అయిన తర్వాత జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా వసంత కృష్ణ ప్రసాద్ అసంతృప్తిగానే ఉన్నారు. వైసిపి హై కమాండ్ పై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యాన్ని సహించుకోలేకపోయారు. సీఎం జగన్ కు ఫిర్యాదు చేసినా.. ఆయన సైతం నియంత్రించలేదు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో ఉండకూడదని భావించారు. ఆయన టిడిపిలోకి వెళతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా జనసేనలో చేరతారని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి దేవినేని ఉమా పై వసంత కృష్ణ ప్రసాద్ గెలుపొందారు. మంత్రిపై విజయం సాధించడంతో జగన్ తనను గుర్తిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా పార్టీలో తనకు ప్రత్యర్థిగా ఉన్న జోగి రమేష్ ను జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి జోగి రమేష్ మైలవరం నియోజకవర్గంలో వేలు పెడుతూ వచ్చారు. ఒకానొక దశలో మైలవరం నుంచి పోటీకి దిగేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ మాత్రం జోగి రమేష్ ను పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ కు లైన్ క్లియర్ అయినట్లు ప్రచారం జరిగింది. అటు జగన్ సైతం వసంత కృష్ణ ప్రసాద్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎందుకో వైసీపీలో కొనసాగేందుకు వసంత కృష్ణ ప్రసాద్ ఇష్టపడలేదు. తాజాగా ఏలూరులో జరుగుతున్న సిద్ధం సభకు తాను హాజరు కాలేనని సమాచారం ఇవ్వడంతో.. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో ఉండరని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆయన స్థానంలో ఒక జడ్పిటిసిని ఇన్చార్జిగా నియమించారు.
అయితే ఇప్పటివరకు వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరతారని అంతా భావించారు.అటు టిడిపి నాయకత్వానికి టచ్ లోకి వెళ్లినట్లు కూడా టాక్ నడిచింది. కానీ ఆయన ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో భాగంగా.. చంద్రబాబు ఆయన జనసేనలోకి చేర్చుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈనెల 4, 5 తేదీల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. ఇప్పటికీ వైసీపీ ఎంపీతో పాటు కీలక నాయకులు జనసేనలో చేరడానికి ముహూర్తాలు నిర్ణయించుకున్నారు. వారితో పాటు వసంత కృష్ణ ప్రసాద్ సైతం జనసేనలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.