Kesineni Sivanath: ఏపీ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్( Kesineni brothers ) కాక రేపుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేలా కేశినేని నాని వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు వరుస లేఖలు రాస్తూ.. తన సోదరుడు, టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని పై ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వరుస ఫిర్యాదులతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. 2014 నుంచి 2024 వరకు వరుసగా పదేళ్లపాటు ఎంపీగా ఉండేవారు కేశినేని నాని. అయితే తెలుగుదేశం పార్టీలో నాని ప్రత్యర్థులతో చేతులు కలిపిన చిన్ని అనూహ్యంగా ఎంపి అయ్యారు. అయితే తాను తన సోదరుడు మూలంగానే టిడిపికి దూరమయ్యానని.. ఎంపీ పదవిని కోల్పోయానని ఆవేదనతో ఉన్నారు నాని. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కేశినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. మొన్న విశాఖలో ఉర్సా అనే ఐటీ సంస్థకు భూముల కేటాయింపు వెనుక.. కేశినేని శివనాథ్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం నిందితులతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
Also Read: జగన్ కు ముందే జిల్లాల పర్యటన.. షర్మిల స్కెచ్ అదే!
* నిందితులతో కలిసి వ్యాపారం..
ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం భావించింది. దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. తాజాగా ఏర్పాటు అయిన సిట్ ముమ్మర విచారణ ప్రారంభించింది. ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేలిపోయింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎంపీకి నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఆయన సోదరుడు స్వయంగా ఆరోపించడం సంచలనంగా మారింది.
* సంచలన లేఖ..
తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని( Kesineni Nani ) సీఎం చంద్రబాబు కు లేఖ రాశారు. సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు నాని.’ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి తో కలిసి ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్.ఎల్.బి అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్లాట్ నెంబర్ 9, సర్వే నంబర్ 403 చిరునామాతో ఈ సంస్థ నమోదయింది. అలాగే రాజ్ కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక మెయిల్ ఐడిని వినియోగిస్తున్నాయి. కేశినేని చిన్ని మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను వినియోగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నది కేశినేని నాని చేస్తున్న ఆరోపణ. దీనిపైనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
* కౌంటర్ ఇచ్చిన ఎంపీ చిన్ని..
అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని( kesinen Chinni ). నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, మా పార్టీ క్యాడర్కు స్పష్టత ఇవ్వడం కోసమే మాట్లాడాల్సి వచ్చింది. వెన్నుపోటు దారుడు, నయవంచకుడు, నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డికి గూడాచారిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు. పని గట్టుకుని చేసే పనికిమాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందు.. మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో రాజ్ కసిరెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండడం కారణంగా.. సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో రిజిస్టర్ అయిన సంస్థ. దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉండేవే అని చెప్పుకొచ్చారు కేసినేని చిన్ని. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత రాజ్ కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు జరపకుండా.. ఆనాడే నిర్ణయం తీసుకున్నట్లు చిన్ని వివరించారు. మొత్తానికైతే కేశినేని బ్రదర్స్ తో చంద్రబాబు ఇరకాటంలో పడుతున్నారు.
Also Read: అమరావతి’ బాధ్యతను ఆ నేతకు అప్పగించిన జగన్!