Keshineni Nani: కేశినేని నాని( Kesineni Nani ) పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? తిరిగి వైసీపీలో చేరుతారా? లేకుంటే బిజెపిలోకి వెళ్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. నాని రాజకీయ సన్యాసం చేశారు. కానీ రాజకీయ కామెంట్లు ఆపడం లేదు. గతంలో ఎవరైనా రాజకీయ సన్యాసం ప్రకటన చేస్తే దానికి కట్టుబడి ఉండేవారు. రాజకీయాల గురించి అస్సలు మాట్లాడే వారు కాదు. అసలు రాజకీయ ఆలోచనలు చేసేవారు కాదు. కానీ ఇప్పుడు రాజకీయ సన్యాసం అన్నమాటకు ఎప్పుడో కాలం చెల్లిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటనలు ఎక్కువగా వచ్చాయి. తమకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని నేతలు ప్రకటించుకున్నారు. కానీ పరోక్షంగా మాత్రం రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేశినేని నాని పరిస్థితి అలానే ఉంది.
Also Read: ట్రంప్ మధ్యవర్తిత్వం సరే.. ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ ఏం తెలుసుకోవాలి?
* వ్యక్తిగత ఇమేజ్ అని భావించి..
2014 నుంచి వరుసగా రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా విజయవాడ( Vijayawada) పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు నాని. రెండుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం నిలిచారు. అయితే అదంతా తన వ్యక్తిగత ఇమేజ్ తో సాధ్యమైందని భావించారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో విభేదాలు పెంచుకున్నారు. తన ఇమేజ్తోపాటు అధికార వైసిపి బలం తోడైతే ఈజీగా హ్యాట్రిక్ కొట్టవచ్చని ఆలోచన చేశారు. కానీ ఆయన ఆలోచన ఒకలా ఉంటే ప్రజల ఆలోచన మరోలా ఉంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కేశినేని నానిని ఓడించారు. మీపై ఇంత నమ్మకం పెట్టుకుంటే ఓడిస్తారా అంటూ మనస్థాపంతో నాని రాజకీయ సన్యాసం ప్రకటన చేశారు. కానీ రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా తనను సైడ్ ట్రాక్ పట్టించి ఎంపీ పదవి కొట్టేసిన తమ్ముడు చిన్ని పై ఆగ్రహంగా ఉన్నారు. అందుకే చిన్నిని టార్గెట్ చేసుకొని కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చూస్తున్నారు.
* వైయస్సార్ కాంగ్రెస్ ఆహ్వానం..
అయితే కేశినేని నానిని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ తిరిగి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి చెందిన కమ్మ సామాజిక వర్గం నేత ఒకరు నానితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే తాను వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని నాని భావిస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ పరిస్థితి సైతం ఏమంత బాగాలేదు. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని నానికి సినిమా మొత్తం అర్థమైంది. మరోవైపు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఆ విషయం నానికి సైతం తెలుసు. అందుకే ఆయన ఎటువంటి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని మాత్రమే చెప్పినట్లు సమాచారం.
* బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు..
మరోవైపు కేశినేని నాని బిజెపిలోకి( Bhartiya Janata Party ) వెళ్లేందుకు బలంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకు బిజెపి జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారా బిజెపిలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. ఏపీలో చంద్రబాబు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే కేశినేని నాని టిడిపి అధినాయకత్వంపై ఘాటు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు బిజెపికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో బిజెపి అగ్రనాయకత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. అందుకే 2029 ఎన్నికల వరకు ఇలానే హడావిడి చేసి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయాలని కేశినేని నాని భావిస్తున్నారు. మొత్తానికి అయితే టిడిపి అధినాయకత్వాన్ని విభేదించి.. హ్యాట్రిక్ ఎంపీ అవకాశాన్ని పోగొట్టుకున్నారు నాని. ఇప్పుడు రాజకీయ సన్యాసం ప్రకటన చేసి.. తిరిగి రాజకీయాల్లోకి రాలేక సతమతమవుతున్నారు.