KCR and Jagan: తెలంగాణ( Telangana) అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మాజీ సీఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల తర్వాత ఆయన సభలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్నదే చట్టసభల్లో తమ వాణిని వినిపించాలని.. కానీ పాలకులు ఆ ప్రయత్నం చేయడం లేదు. అయితే తన స్నేహితుడు కేసీఆర్ హాజరవుతుండడంతో.. ఆ ప్రభావం ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే జగన్ సైతం సభకు హాజరు కావడం లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు హాజరవుతానంటూ తేల్చి చెబుతున్నారు.
అనివార్య పరిస్థితుల్లో..
తెలంగాణలో కెసిఆర్ ( KCR) పార్టీకి 36 సీట్లు వచ్చాయి. నిబంధనల ప్రకారం అసెంబ్లీ సీట్లలో 10% స్థానాలు వస్తేనే వారికి ప్రతిపక్ష హోదా దక్కేది. కెసిఆర్ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు రావడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే కెసిఆర్ సైతం కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు మాత్రమే సభకు వచ్చారు. తర్వాత అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చింది. సవాళ్లు చేస్తూ సభకు రావడం మానేశారు కెసిఆర్.. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డిని సభలో ఇరకాటంలో పెట్టకపోతే ప్రజలు నమ్మరని కెసిఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు నుంచి సభకు హాజరయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. సభలోనే సీఎం రేవంత్ ను ఓ స్థాయిలో నిలదీసేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు సమాచారం.
రాజకీయ మిత్రులు..
ఎంత కాదనుకున్నా.. కెసిఆర్ జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) అత్యంత మిత్రుడు. పరస్పర రాజకీయ ప్రయోజనాలతో ఇద్దరు అడుగులు వేసిన వారే. ఈ ఇద్దరు నేతలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారే. ఏది చేసినా కలిసే చేసేవారు. చివరకు యజ్ఞలు యాగాలు విషయంలో కూడా కెసిఆర్ ను అనుసరించే వారు జగన్. అందుకే ఇప్పుడు కెసిఆర్ శాసనసభకు హాజరవుతుండడంతో.. జగన్ హాజరవుతారా? లేదా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా ఏపీలో దీనిపై చర్చ నడుస్తుంది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న బంధం అటువంటిది. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభలో అడుగు పెట్టను అని మారం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయంలో పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థులు దీనిని ఒక ప్రచార అస్త్రంగా కూడా మార్చుకుంటారు. అయితే సభకు హాజరైతే ఏ పరిస్థితులు ఎదురవుతాయో జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కెసిఆర్ మాదిరిగా జగన్ కౌంటర్ ఇచ్చే పొజిషన్లో లేరు. అందుకే జగన్ హాజరు విషయంలో మరిచిపోవడమే ఉత్తమమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.