KCR And Jagan: రాజకీయాలు చేయవచ్చు కానీ.. ప్రత్యర్థి పార్టీలు లేకుండా చేయాలని.. వాటిని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం అత్యంత ప్రమాదకరం. అది వికటిస్తే ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు తెలుస్తోంది. సొంత కుమార్తె కవిత ఆరోపణలతో కెసిఆర్ పార్టీ ఇప్పుడు సతమతం అవుతోంది. ఆ పార్టీ అసలు తెలంగాణలో నిలబడుతుందా? లేదా? అన్న అనుమానం కలుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లను సాధించింది కేసీఆర్ పార్టీ. కానీ అక్కడకు ఎనిమిది నెలల వ్యవధిలోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఆ పార్టీలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకవైపు పార్టీ పతనం అవుతుండగా.. మరోవైపు ఆ కుటుంబం సైతం ప్రజల్లో చులకన అవుతోంది. అయితే ఈ విషయంలో కెసిఆర్ మాదిరిగానే జగన్ పరిస్థితి ఉంది.
* టిడిపి కనుమరుగుతో..
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కనుమరుగైతే తప్ప తన పార్టీ బతకదని కెసిఆర్ కు తెలుసు. అందుకే తనకు రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశారు కేసీఆర్. అలా చేసేదాకా విడిచిపెట్టలేదు కూడా. పోనీ తన మాటను గౌరవించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నైనా గౌరవంతో చూశారా అంటే అది లేదు. ఆ పార్టీని ఎంత దెబ్బతీయాలో అంతలా తీశారు. చాలా హీనంగా మాట్లాడేవారు. కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కాంగ్రెస్కు వెన్నుపోటు పొడిపించిన ఘనత కూడా కెసిఆర్ కే దక్కుతుంది. అందుకే కర్మఫలం అనేది ఎవ్వరికీ విడిచిపెట్టదు. ఇప్పుడు కెసిఆర్ కు జరుగుతోంది అదే. ముందు ఆ పార్టీ బతుకుతుందా? లేదా? అన్నది చూడాలి.
* టిడిపిని వెంటాడిన జగన్..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) సైతం తెలుగుదేశం పార్టీని పూర్తిగా నాశనం చేయాలని చూశారు. ఆ పార్టీని దారుణంగా దెబ్బతీయాలని ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని నిండు సభలో అవమానించారు. తన సహచరులు దారుణ వ్యాఖ్యలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అంతటితో ఆగకుండా తన తండ్రి సమానుడైన చంద్రబాబును జైల్లో పెట్టించారు. అప్పటి కొందరు కేంద్ర పెద్దల సాయంతో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడానికి పన్నాగం పన్నారు. అయితే ఆయన ఒకటి తలిస్తే.. ప్రజలు ఒకటి తలచినట్టు.. తెలుగుదేశం పార్టీకి విజయం అందించి. జగన్మోహన్ రెడ్డి పన్నాగాన్ని తిప్పికొట్టారు ప్రజలు. అయితే ఇప్పుడు కర్మఫలం జగన్మోహన్ రెడ్డికి సైతం విడిచిపెట్టడం లేదు. ఏ పార్టీని నాశనం చేయాలని చూశారో.. ఏ కూటమి పార్టీలను తక్కువ చేసి మాట్లాడారో.. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు అన్నారో.. ఇప్పుడు అదే జరిగింది. కర్మఫలం అనేది జగన్మోహన్ రెడ్డికి వెంటాడడం ప్రారంభించింది.
* కుంభకోణాలతో..
తెలంగాణలో కేసీఆర్( KCR) కు కాలేశ్వరం ప్రాజెక్ట్.. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణం.. ఈ రెండు ఇప్పుడు వెంటాడుతున్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టుతో కాసులు కొల్లగొట్టారు నాటి పాలకులు. మద్యం కుంభకోణంలో 18 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని పక్కకు తప్పించారు. అందుకే ఇప్పుడు ఏ పార్టీలు నిర్వీర్యం కావాలని కోరుకున్నారో.. ఇప్పుడు అదే పార్టీలు కర్మఫలం రూపంలో వెంటాడుతున్నాయి. కర్మ ఫలం అంటే ఇప్పుడు సరికొత్త నిర్వచనం గా కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిలను చూపిస్తున్నారు.