Kashibugga Stampede Incident: కాశీబుగ్గ ( Kashi Bugga )తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షలు అందించనుంది. శనివారం రాత్రి మంత్రి నారా లోకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాధితులకు పరిహారం ప్రకటించారు నారా లోకేష్. గాయపడిన వారికి సైతం మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో 16 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
* భక్తుల రద్దీతో ఘటన..
కార్తిక ఏకాదశి సందర్భంగా చిన్న తిరుమల గా పేరుగాంచిన కాశిబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు భారీగా పోతెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట ఘటన జరిగింది. దీంతో రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెనాయుడు, కొండపల్లి శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ చర్యలను పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగమంతా పలాస చేరుకుంది. ఈ తరుణంలో భోపాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన షెడ్యూల్ రద్దు చేసుకుని తిరుగు ముఖం పట్టారు. మంత్రి నారా లోకేష్ తో కలిసి శనివారం రాత్రికి పలాస చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు.
* పేద ప్రజల కోసం నిర్మాణం..
అయితే ఆలయ వ్యవస్థాపకుడు హరి ముకుంద పండా ఈ ప్రాంతీయుల కోసమే ఆలయాన్ని నిర్మించారు. అయితే ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే హరి ముకుంద పండా 95 ఏళ్ల వృద్ధుడు. కానీ ఆయన విషయంలో ప్రజల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కాలేదు. ఎందుకంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేదలకు స్వామివారి దర్శనం కల్పించే వీలుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఘటన మరోసారి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రైవేటు ఆలయాల నిర్వహణపై దృష్టి పెడతామని కూడా చెప్పుకొచ్చారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సైతం రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ లెక్కన 17 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు దక్కనున్నాయి.