Jogi Ramesh Arrested: ఏపీలో( Andhra Pradesh) నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భారీ నకిలీ మద్యం డంప్ స్వాధీనం అయింది. అప్పటినుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ తిరిగి అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ ఇరుక్కున్నారు. ఆయన అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున ఆయన ఇంటికి ప్రత్యేక దర్యాప్తు బృందం వెళ్ళింది. ఆయనతో పాటు సోదరుడు రాముని సైతం అరెస్టు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటి వద్ద ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఉన్నారు.
Also Read: కాశీబుగ్గ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్!
* వైసిపి మెడకు.. తంబళ్లపల్లె( Tambalappalli) నియోజకవర్గం మొలకలచెరువులో భారీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ తనిఖీలో పట్టుబడింది. తంబాళ్లపల్లి టిడిపి ఇన్చార్జ్ జయ చంద్రారెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో టిడిపి హై కమాండ్ ఆయనపై వేటు వేసింది. అదే సమయంలో ఇబ్రహీంపట్నంలో సైతం భారీ నకిలీ మద్యం డంప్ ను వెలుగులోకి తెచ్చారు మాజీ మంత్రి జోగి రమేష్. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడడం ప్రారంభించింది. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు విదేశాల నుంచి ఏపీకి చేరడంతో మలుపు తిరిగింది.
* ఎంతో సన్నిహితుడు..
అద్దేపల్లి జనార్దన్ రావు మాజీ మంత్రి జోగి రమేష్( Jogi Ramesh) సన్నిహితుడని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా జనార్దన్ రావు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో సైతం తాము మద్యం కల్తీ చేసినట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో మాజీమంత్రి జోగి రమేష్ ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం చలామణి చేసినట్లు కూడా వివరించాడు. తనకు ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోగా కేసులో ఇరికించడంతోనే తాను ఈ విషయం బయటపెట్టినట్లు చెప్పాడు. కేవలం కూటమి ప్రభుత్వంతోపాటు సీఎం చంద్రబాబు కు చెడ్డపేరు తీసుకువచ్చే విధంగా ఈ నకిలీ మద్యం తయారుచేసినట్లు అద్దేపల్లి జనార్దన్ రావు బయటపెట్టాడు. దీంతో అడ్డంగా బుక్కయ్యారు మాజీ మంత్రి జోగి రమేష్. అటు జోగి రమేష్ పాత్ర ఉందని తెలియడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక మౌనం పాటించడం ప్రారంభించింది.
* ప్రభుత్వం సీరియస్..
తప్పు చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వంపై ఆ తప్పును నెట్టి వేయడానికి మాజీ మంత్రి జోగి రమేష్ ప్రయత్నించారు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం కుట్ర కోణంలో విచారణ చేపట్టింది. జోగి రమేష్ కు వ్యతిరేకంగా అనేక అంశాలను సేకరించగలిగింది. ఇప్పటికే కోర్టుకు కూడా నివేదించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు జోగి రమేష్ అరెస్టుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.