Congress : ఆ రాష్ట్రాల జాబితాలో కర్నాటక.. కాంగ్రెస్ లో అంతే

దాంతో ప్రభుత్వం కూలిపోయింది.  ఇప్పుడు కర్నాటకలో సిద్ధరామయ్య, డీకేల మధ్య అదేస్థాయిలో పోరు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 18, 2023 6:51 pm
Follow us on

Congress : కాంగ్రెస్ పతనానికి కాంగ్రెస్సే కారణం.. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. కానీ ఈ అపవాదు నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం లేదు. ఇప్పుడు కర్నాటక ఎపిసోడ్ నే తీసుకుందాం. ప్రజలు మంచి మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టారు. నమ్మకంతో పవర్ చేతిలోపెట్టారు. కానీ ప్రజల్లో పలుచన అయ్యే విధంగా ఇంతవరకూ సీఎం అభ్యర్థిని ప్రకటించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నాటక పరిస్థితి చూస్తుంటే మరో రాజస్థాన్, మధ్యప్రదేశ్ లా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

రెక్కలు కష్టం ఒకరిది.. పవర్ మరొకరిది అన్న స్థితి కాంగ్రెస్ లో ఉంది. దీనికి చాలా రకాల సమీకరణలు చూపి హైకమాండ్ సమర్థించుకుంటూ వస్తోంది. అదే స్థాయిలో మూల్యం చెల్లించుకున్న సందర్భాలు ఉన్నాయి. కర్నాటక అసెంబ్లీలో  224 స్థానాలకు కాంగ్రెస్ కు 136 సీట్లొచ్చాయి. తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు  కూడా కాంగ్రెస్ కే జై కొట్టారు. దాంతో కాంగ్రెస్ బలం 138కి పెరిగింది. రోజులు గడుస్తున్నా సీఎం, కేబినెట్ కూర్పు వంటివి చేయలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ ఉండడం ఆ పార్టీకి ఇబ్బందికరమే.

సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇచ్చేందుకు హైకమాండ్ మొగ్గుచూపుతోంది. అయితే ఇందుకు డీకే అంగీకరించకపోవడంతో అధికారిక ప్రకటన చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం సిద్ధరామయ్యకు పదవి అప్పగించాల్సిన అనివార్య పరిస్థితులు. అదే కానీ జరిగితే డీకే వైఖరి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్న.  కొంతకాలమైన తర్వాతయినా ప్రభుత్వంపై డీకే తిరుగుబాటు తప్పదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. బలమైన ఇద్దరు నాయకులు ఉన్నచోట ఒకరికే ప్రాధాన్యత ఇవ్వడంతో రెండో నాయకత్వం తిరుగుబాటు చేసి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చింది.

రాజస్ధాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్ పై సచిన్ పైలెట్ తిరుగుబాటు లేవదీశారు. సచిన్ కారణంగా రాజస్ధాన్లో ప్రభుత్వం కూలిపోయే పరిస్ధితి రెండుసార్లు వచ్చింది. అయితే సకాలంలో అధిష్టానం జోక్యం చేసుకోవటంతో దినదినగండంలాగ నడుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా సీఎం పోస్టుకోసమే కమలనాధ్ కు జ్యోతిరాధిత్య సింథియాకు గొడవలయ్యాయి. ఇక్కడే సింథియానే కష్టపడితే సీఎం పోస్టును కమల్ కొట్టుకుపోయారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలై చివరకు సింథియా తన వర్గంతో తిరుగుబాటు చేసి పార్టీని వదిలేశారు. దాంతో ప్రభుత్వం కూలిపోయింది.  ఇప్పుడు కర్నాటకలో సిద్ధరామయ్య, డీకేల మధ్య అదేస్థాయిలో పోరు ఎదురయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.