YS Sharmila Latest News: ఏపీలో( Andhra Pradesh) టీడీపీ కూటమి ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఒకటి. మరోవైపు విపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు సైతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీగా టిడిపిని కాంగ్రెస్ వ్యతిరేకించాలి. టిడిపి ప్రభుత్వ విధానాలపై పోరాడాలి. కానీ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల తమలపాకుతో టిడిపిని కొడుతున్నారు. సమ్మెటతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బాదేస్తున్నారు. అయితే షర్మిల వ్యవహార శైలి అందరికీ తెలిసిన విషయమే. ఆమె ప్రత్యేక అజెండాను సొంత పార్టీ నేతలే గుర్తించారు. ఆమె బాధ్యతలు తీసుకుని రెండు సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇబ్బందులు తెచ్చి పెట్టింది.
కర్ణాటక నేతల సాయంతో..
అయితే షర్మిలకు( Y S Sharmila) కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడం వెనుక.. కర్ణాటక నేతలు ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టుబట్టి షర్మిలకు ఇక్కడ పిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ఇప్పుడు అదే కర్ణాటక కాంగ్రెస్ నేతల విషయంలో కక్కలేక.. మింగలేని స్థితిలో ఉన్నారు షర్మిల. మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కర్ణాటక మంత్రిగా ఉన్నారు. ఇటీవల తరచు ఏపీపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఏపీ అప్పులతో పాటు ద్రవ్య లోటును ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ఏపీ మంత్రి నారా లోకేష్ పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి లోకేష్ నుంచి కూడా స్ట్రాంగ్ రిప్లై వస్తోంది. అయితే ఈ అంశంపై షర్మిల ఎలా ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. వాస్తవానికి ఆ పార్టీ నేతలు దాడి చేస్తే వారిని అనుసరించాలి. కానీ షర్మిల మాత్రం ఆ పని చేయడం లేదు. లోకేష్ తో పాటు ఏపీ ప్రభుత్వ జోలికి వెళ్లడం లేదు.
బిజెపి పై విమర్శలతో..
ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ( Google data centre) ఏర్పాటు నేపథ్యంలో కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కొన్ని రకాల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రాయితీలతో పాటు పనుల మినహాయింపు ఇవ్వడం వల్లే గూగుల్ డాటా సెంటర్ ఏపీకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇలా అయితే కర్ణాటకలో కుదరదని.. ఇన్ని రకాల మినహాయింపులు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది ఏమంత గొప్ప విషయం కాదన్నట్టు తేలిగ్గా మాట్లాడారు. దీనిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. అయితే పార్టీ జాతీయ అధ్యక్షుడు కుమారుడు, తమ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను సమర్థించలేకపోతున్నారు షర్మిల. అందుకే బిజెపి పై నిత్యం విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోదీ పై ఆరోపణలు చేస్తున్నారు. కానీ టిడిపి కూటమికి ఒక మాట అనడం లేదు. ఒక విధంగా కర్ణాటక కాంగ్రెస్ షర్మిలను ఇబ్బంది పెడుతున్నట్టే.