Kapu Dalit and BC: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి తక్కువగా అంచనా వేస్తే కూటమికి నష్టమే. ఎందుకంటే ఆ పార్టీ చివరి వరకు పోరాటం చేసే సైన్యం కలిగి ఉంది. ముఖ్యంగా కాలకేయ సోషల్ మీడియా సైన్యం వైసీపీ సొంతం. మరోవైపు సామాజిక వర్గాల్లో విభేదాలు తెచ్చి రాజకీయ లబ్ధి పొందడం వెన్నతో పెట్టిన విద్య. 2014 నుంచి 2019 మధ్య ఆ పరిస్థితిని చూశాం. ఎందుకంటే అప్పటివరకు చంద్రబాబు ప్రోత్సహించిన నేతలు సైతం ఎదురు తిరిగారు. సామాజిక వర్గాలను ఎగదోసి వైసీపీకి ఎక్కువ ప్రయోజనం చేకూర్చారు. చివరకు తటస్థులు, విశ్లేషకుల ముసుగులో సైతం చాలా రకాలుగా వైసీపీకి ఫేవర్ చేశారు. అప్పుడెప్పుడో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసి పదవీ విరమణ చేసిన ఐవిఆర్ కృష్ణారావు లాంటి వారిని ఏకంగా సలహాదారు పదవిలో ఉంచారు. కార్పొరేషన్ కు చైర్మన్ చేశారు. అదే వ్యక్తి నాడు టిడిపికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసి ప్రత్యర్థికి పరోక్ష సహకారం అందించారు. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమం కూడా అలానే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ప్రయోజనం చేకూర్చింది. చంద్రబాబు పట్ల కాపులు ద్వేషించుకునేలా చేసింది.
సరికొత్త వ్యాఖ్యలు..
అయితే ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ఒక అనుమానం. ఎందుకంటే ఇటు ఇవాళ కొందరు వ్యాఖ్యలు చూస్తుంటే అలానే ఉన్నాయి. కాపులు, దళితులు, బీసీలు ఏకం అయితే రాజ్యాధికారం ఇట్టే దక్కుతుందని సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్( IPS officers Sunil Kumar) వ్యాఖ్యానించారు. ఇదే సునీల్ కుమార్ వైసీపీ హయాంలో కీలక అధికారి. సిఐడి చీఫ్ గా కూడా వ్యవహరించారు. కానీ ఆ మూడు వర్గాల ఐక్యత అన్నమాట అప్పుడు అనలేకపోయారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు అంటే అది అందరికీ విధితమే. కాపులు టిడిపి కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి. ఇప్పుడు అత్యవసరంగా కాపుల్లో విభేదాలు రావాలి. ఆపై బీసీ సామాజిక వర్గాల్లో కూడా కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రావాలి. అందులో భాగంగానే ఈ కొత్త నినాదం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలా కాపులు వ్యతిరేకం..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. కొద్ది రోజులకే ముద్రగడ పద్మనాభం( mudragada Padmanabham ) కాపు రిజర్వేషన్ ఉద్యమంతో బయలుదేరారు. కాపులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు అంటూ ప్రశ్నించారు. మీరు హామీ ఇచ్చారు కాబట్టి కచ్చితంగా అమలు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉండగానే ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. చివరకు తుని రైలు ఘటనతో ఉద్యమం హింసాత్మక పరిస్థితికి దారితీసింది.. ఈ ఘటనతో కాపులు టిడిపికి దూరమయ్యారు. అలాగని పవన్ కళ్యాణ్ కు దగ్గర కాలేదు. అప్పటి టిడిపి ప్రభుత్వం ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించింది. అయినా వారిలో సంతృప్తి దొరకలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారని అటువైపు వెళ్లారు కాపులు. చంద్రబాబు ఇచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను సైతం తొలగించారు జగన్మోహన్ రెడ్డి. ఐదేళ్లపాటు ఒక్కటంటే ఒక్కటి కూడా కాపుల గురించి మంచి పథకం పెట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన కాపులు పవన్ కళ్యాణ్ ను నమ్మారు. మొన్న ఎన్నికల్లో టిడిపి కూటమికి ఓటు వేశారు.
ఎస్సీల్లో స్పష్టమైన చీలిక..
ఎస్సీల పరిస్థితి కూడా అదే. ఆది నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకు గా ఉన్న ఆవర్గం తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. అలా ఆ పార్టీకి దగ్గర అయింది. కానీ వారిని ఓటు బ్యాంకుగా మలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తమలో కూడా వెనుకబడిన వర్గాలు ఉన్నాయని.. దయచేసి వర్గీకరణ చేయాలని వారు కోరారు. కానీ జగన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి వచ్చాక ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఆ వర్గంలో అట్టడుగులో ఉన్నవారికి న్యాయం జరిగింది. దళితుల్లో కూడా చీలిక కనిపిస్తోంది. గతం మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఏకపక్షంగా లేరు. అందుకే కాపు, దళిత, బిసి కార్డు అన్నమాట. అయితే ఇప్పటికే ఇటువంటి వాటిలో గుణపాఠాలు నేర్చుకున్నారు చంద్రబాబు. అంత ఈజీగా పడే అవకాశం మాత్రం లేదు. చూడాలి ఏం జరుగుతుందో?