AP Elections 2024: కమ్మ సామాజిక వర్గం అంచనా అదే

టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తోంది కమ్మ సామాజిక వర్గం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు వెంట కమ్మ సామాజిక వర్గం నడిచింది.

Written By: Dharma, Updated On : May 23, 2024 12:49 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానిది ప్రత్యేక స్థానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది ఆ సామాజిక వర్గం.అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేశారన్నది వారి నుంచి వస్తున్న ఆవేదన. అందుకే ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మొత్తం టిడిపి కూటమి కోసం గట్టిగానే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారు వచ్చి ఈ ఎన్నికల్లో కూటమి తరుపున సేవలందించారు. పోలింగ్ ముగియడంతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలో 125 నుంచి 135 స్థానాల్లో టిడిపి కూటమి విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నారు.

టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడుస్తోంది కమ్మ సామాజిక వర్గం. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు వెంట కమ్మ సామాజిక వర్గం నడిచింది. కానీ అటు తరువాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం కూడా ఆచితూచి వ్యవహరించింది. టిడిపి నాయకత్వం తమను పట్టించుకోలేదన్న ఆవేదన ఉన్నవారు కాంగ్రెస్, టిఆర్ఎస్, ఇతరత్రా పార్టీల్లో కొనసాగారు. అయితే రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో రెడ్లు, ఏపీలో వైసీపీ ఆవిర్భావంతో రెడ్డి సామాజిక వర్గం యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కారు. అందుకే తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వారు అహోరాత్రులు శ్రమించారు.

ప్రపంచవ్యాప్తంగా వ్యాపార,వాణిజ్య రంగాల్లో కమ్మ సామాజిక వర్గం వారు విశేషంగా రాణిస్తూ వచ్చారు. ఈసారి కానీ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని వారు భయపడ్డారు. అందుకే ఆర్థికంగా, సామాజిక వర్గ పరంగా టిడిపి కూటమికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకుగాను భారీగా ఆర్థిక సాయం చేశారు. సమాజంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం శత శాతం ఓట్లు కూటమికి దక్కాయి. తాము వేయడమే కాదు.. ఒక డాక్టర్ అయితే తన రోగులకు, వారి బంధువులకు.. ఒక వ్యాపారి అయితే తన వినియోగదారులకు, తన తోటి వ్యాపారులకు.. ఒక విద్యావేత్త అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి బంధువులకు.. ఇలా కమ్మ సామాజిక వర్గం ఏ రంగంలో ఉన్న.. చాలా వరకు ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అటు ఆర్థికంగా నిధులు సమీకరించి నియోజకవర్గాలకు పంపారు. అందుకే ఇప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయని లెక్క కడుతున్నారు. 125 నుంచి 135 స్థానాలు వస్తాయని ధీమాతో వారు ఉండడం విశేషం.