Kambhampati Haribabu : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా ఉన్న వారిని బదిలీ చేశారు. ఒడిస్సా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్ గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్, బీహార్ గవర్నర్ గా అరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ లను నియమించారు. గవర్నర్ల నియామకాల బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.
* హరిబాబుకు ఒడిస్సా బాధ్యతలు
ఏపీకి చెందిన కంభంపాటి హరిబాబుకు ఒడిస్సా గవర్నర్ గా బాధ్యతలు అప్పగించడం విశేషం. ఆయన బిజెపికి చెందిన సీనియర్ నాయకుడు. 2014 ఎన్నికల్లో బిజెపి తరఫున విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన విజయమ్మ పై విజయం సాధించారు. ఏపీ బీజేపీ సీనియర్లలో హరిబాబు ఒకరు. అందుకే ఆయనను గవర్నర్ గా ఎంపిక చేసింది కేంద్రం. మిజోరాం గవర్నర్ గా నియమించింది. ఇప్పుడు బదిలీల్లో భాగంగా ఒడిస్సా బాధ్యతలను అప్పగించింది.
* ఎంపీగా,ఎమ్మెల్యేగా సేవలు
కంభంపాటి హరిబాబు విశాఖ నగరంలో స్థిరపడ్డారు. కానీ ఆయన సొంత జిల్లా ప్రకాశం. ఆ జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు ఆయన. అటు తరువాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందారు. ఆంధ్ర యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేసి 1993లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. బిజెపిలో కీలకంగా మారారు. ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించారు. 2021 లో తొలిసారిగా మిజోరాం గవర్నర్ గా నియమితులయ్యారు. తాజాగా ఒడిస్సా గవర్నర్ గా ఆయనను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.