Kalisetti Appalanaidu : ఆ టిడిపి ఎంపి( Telugu Desam Party MP) శైలి వినూత్నం. సామాన్య టిడిపి నాయకుడిగా ఉన్న ఆయనకు అవకాశం ఇచ్చారు అధినేత చంద్రబాబు. ఏకంగా ఎంపీ టికెట్ ఇచ్చారు. అనూహ్యంగా ఆయన గెలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి తనదైన ముద్ర చాటుతూ వస్తున్నారు సదరు ఎంపీ. ఇప్పుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, మగపిల్లలు పుడితే ఆవు దూడను బహుమతిగా ఇస్తున్నారు. తన సొంత నిధులతో అందివ్వడం ప్రారంభించారు. వినడానికి వింతగా ఉంది కదూ.. కానీ ఇది నిజం. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటే.. విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు( kalisetty appala Naidu ).
Also Read : పదవుల కోసం జగన్ కు సాష్టాంగ నమస్కారాలు.. నిజం ఎంత?
* అందరికంటే భిన్నం.. విజయనగరం( Vijayanagaram) ఎంపీగా ఎన్నికైన అప్పలనాయుడు వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా సంచలనమే. తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయన చాలా క్రమశిక్షణగా ఉంటారు. మొన్నటి లోక్సభ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ నుంచి హాజరులో ప్రథమ స్థానం నిలిచారు. ప్రశ్నలు వేయడంలో సైతం ముందు వరుసలో నిలిచారు. ఢిల్లీలో తన వాహనాన్ని విడిచిపెట్టి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లిన ఘనత ఆయనది. సంప్రదాయ వస్త్రధారణలో.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తారు. అయితే ఆయన తాజాగా తన విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఎవరికైనా మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే 50 వేల రూపాయల నగదు, మగ పిల్లాడు పుడితే ఆవు దూడను బహుమతిగా ఇస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా పెరగాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలోనే ఈ నిర్ణయానికి వచ్చారు కలిశెట్టి అప్పలనాయుడు.
* నగదు తో పాటు ఆవు దూడల పంపిణీ..
నెల్లిమర్ల ( nelli Marla)అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలం సవరవిల్లిలో మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టిన సురేష్, దివ్య దంపతులకు 50 వేల రూపాయల చెక్కును అందించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి లో.. మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టడంతో వెంకటలక్ష్మి అనే బాలింతకు 50వేల రూపాయల చెక్కు అందించారు. అంతేకాదు మగ పిల్లలు పుట్టిన నాగమణి, శాంతమ్మలకు ఆవు దూడలను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం విజయనగరం ఎంపీ అప్పలనాయుడు చేసిన ఈ కార్యక్రమం విపరీతంగా వైరల్ అవుతుంది.
* చంద్రబాబుకు వీరాభిమాని..
టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) నాయుడుకు వీరాభిమాని ఎంపీ అప్పలనాయుడు. టిడిపి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆయన. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర టిడిపి శిక్షణ శిబిరం డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎంతోమంది నేతలకు శిక్షణ ఇచ్చి సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దారు. అయితే సాధారణ నాయకుడిగా ఉన్న అప్పలనాయుడులో నాయకత్వ లక్షణాలను గుర్తించారు చంద్రబాబు. అందుకే విజయనగరం పార్లమెంటు స్థానానికి టిడిపి అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత కూడా అప్పలనాయుడుకు చంద్రబాబుపై అభిమానం మరింత రెట్టింపు అయింది. అందుకే చంద్రబాబు పుట్టినరోజు నాడు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.