https://oktelugu.com/

Kakinada Port Case: కాకినాడ సి పోర్టు కేసు : ఆ రూ.494 కోట్లు చుట్టూ విచారణ

బెదిరించి కాకినాడ పోర్టు యాజమాన్య హక్కులు పొందారన్నది వైసీపీ నేతలపై వచ్చిన ఆరోపణ. బాధితుడు నేరుగా ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేసింది.

Written By: , Updated On : December 23, 2024 / 10:01 AM IST
Kakinada Port Case

Kakinada Port Case

Follow us on

Kakinada Port Case: కాకినాడ పోర్టు కేసు రాష్ట్రంలో సంచలనం గా మారింది. పోర్టు యజమానికి సంబంధించి వాటాలను బలంగా బదలాయించడంతో.. బాధితుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. సిఐడి కి అప్పగించడంతో అందరి దృష్టి ఈ కేసు పై పడింది. ప్రస్తుతం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సిఐడి. అభియోగాలు ఎదుర్కొంటున్న అరబిందో శరత్ చంద్రారెడ్డికి సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న ఆయన విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి తో పాటు వైవి సుబ్బారెడ్డి కుమారుడికి సైతం సిఐడి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. తనను బెదిరించి కోర్టుకు సంబంధించి యాజమాన్య హక్కులను పొందారు అన్నది కాకినాడ సి పోర్ట్ లిమిటెడ్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కెవి రావు ఆరోపిస్తున్నారు. ఏకంగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి ల పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సిఐడి కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

* ప్రభుత్వ పెద్దల హస్తం
దీని వెనుక నాటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది ప్రధాన ఆరోపణ. వేల కోట్లు విలువచేసే సీ పోర్ట్ యాజమాన్య హక్కులను.. వందల కోట్లకు తగ్గించి.. బలవంతంగా వాటాలు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ. అయితే సిపోర్టు కొనుగోలుకు సంబంధించి ఆ 450 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది ఇప్పుడు ప్రశ్న. ఆర్థిక నేరం, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసు కావడంతో ఈడీ సైతం ఎంటర్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులుగా ఉన్న వారికి సిఐడి లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వారు విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.

* జరిగింది ఇది
ఈ ఏడాది మేలో 2500 కోట్ల రూపాయల విలువ చేసి కాకినాడ సి పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్ షేర్లను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి అడ్డగోలుగా బదలాయించుకున్నారన్నది వారిపై వచ్చిన ప్రధాన ఆరోపణ. సి పోర్ట్ లిమిటెడ్ షేర్ల మొత్తం విలువ 2500 కోట్ల రూపాయలు. వాటిని 494 కోట్లకు బలవంతంగా కొనుగోలు చేశారు. 1109 కోట్ల రూపాయల విలువ చేసే సెజ్ షేర్ల విలువను అతి తక్కువ ధరకు అరబిందో ఫార్మా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదలాయించారని వారిపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే అరబిందోకు ఆ స్థాయిలో వచ్చిన మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ప్రధాన అంశం. దాని చుట్టూనే ఇప్పుడు విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తాను విచారణకు హాజరవుతానని శరత్ చంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. మరి విజయసాయిరెడ్డి తో పాటు వైవి విక్రాంత్ రెడ్డి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.