Allu Arjun: తెలుగు రాజకీయాల్లో అల్లు అర్జున్ ఇప్పుడు హైలెట్ అవుతున్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ను బాధ్యుడు చేస్తూ తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా చేశారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ సినిమాను అడ్డుకుంటామని జనసైనికులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేశారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో చాలా రకాల మినహాయింపులు ఇచ్చాయి. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రీమియర్ షోల ప్రదర్శనలకు అనుమతిచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ తో పాటు హీరో అల్లు అర్జున్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అదే సమయంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఒకరు ఈ సినిమా తీసిన తీరుపై ఆక్షేపించారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇదిలా కొనసాగుతుండగానే ఈనెల 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తొక్కిసలాటలో చిక్కుకుపోయింది. తల్లి మృతి చెందగా.. కుమారుడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడు. అయితే ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ అరెస్టు చేశారు తెలంగాణ పోలీసులు. దీంతో అప్పటి వరకు ఉన్న సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
* తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటనతో
అల్లు అర్జున్ ను మెగా కుటుంబంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు పరామర్శించారు. ఆయన అరెస్టు సరికాదని చెప్పుకొచ్చారు. అయితే దీనిపై శాసనసభలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక సినిమా మూలంగా ఒక కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని.. ఒక మహిళ మృతి చెందిందని.. ఆమె కుమారుడు కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నాడని.. ఆ కుటుంబం పై జాలి చూపకుండా.. వందల కోట్లు సంపాదించుకునే సినీ నటులపై ఎందుకు అంత ప్రేమ అని ఆక్షేపించారు. దీంతో ఈ అంశం కొత్త పొలిటికల్ ఎపిసోడ్ వైపు దారితీసింది. అప్పటివరకు ఈ సినిమా తీరును తప్పు పట్టిన బిజెపి అభిప్రాయం మారింది.
* పురందేశ్వరి తాజా ప్రకటన
తాజాగా అల్లు అర్జున్ వివాదం పై స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేముందని ప్రశ్నించారు. అసలు ఆరోజు అల్లు అర్జున్ ఎటువంటి ప్రేరేపిత చర్యలకు పాల్పడలేదని గుర్తు చేశారు. సినిమాలను అడ్డుకోవడం తగదన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే ఒకరు పుష్ప 2 చిత్రాన్ని తప్పు పట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మారడంతో బిజెపి వాయిస్ మారినట్లు కనిపిస్తోంది.అటు మెగా కుటుంబం సైతం అల్లు అర్జున్ కు అండగా నిలబడడం ఈ మార్పునకు మరో కారణం. ఏది ఏమైనా అల్లు అర్జున్ విషయంలో బిజెపి యూటర్న్ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.