Kakinada Auto News: పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనాలు నడపలేకపోతున్నారు. పోనీ ఎలక్ట్రిక్ వాహనాలు( electric vehicles) నడుపుదామంటే కరెంట్ బిల్లులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు. ఏకంగా ఆటోకు సోలార్ ప్యానల్స్ అమర్చి.. పెట్రోల్, విద్యుత్ భారం లేకుండా ఉపాధి పొందుతున్నాడు. రోజుకు ఎనిమిది గంటలపాటు సూర్యరశ్మితో ఏకంగా ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. కాకినాడ జిల్లాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఇలా కొత్తగా ఆలోచించి సక్సెస్ అయ్యాడు. నలుగురికి ఇప్పుడు మార్గదర్శకంగా నిలిచాడు.
Also Read: సోలార్ ప్యానల్ బిజినెస్ తో లక్షల్లో సంపాదించవచ్చు.. ఎలా అంటే..?
పెరిగిన వినియోగం..
ప్రస్తుతం వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే పెరిగిన కాలుష్యంతో పెట్రోల్, డీజిల్ కంటే.. ఎలక్ట్రిక్ వాహనాలే మంచిదని కేంద్ర పర్యావరణ శాఖ చెబుతోంది. దీంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వారికి కరెంటు షాక్ తప్పడం లేదు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇదో ఇబ్బందికర పరిణామంగా మారింది. డీజిల్ ఖర్చు తగ్గుతుందని ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే.. కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. ఆటోకు చార్జింగ్ పెడితే కరెంటు బిల్లులు అధికంగా వస్తున్నాయని ఎక్కువ మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యుత్ చార్జీలు పెరిగితే సంక్షేమ పథకాలుకు కోత విధిస్తున్నారు. దీంతో కాకినాడకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఈ సమస్యకు చెక్ పెట్టారు. స్మార్ట్ గా ఆలోచించి కరెంట్ బిల్లుల ఖర్చు లేకుండా కొత్త ప్లాన్ వేశారు. అందులో సక్సెస్ అయ్యారు.
Also Read: లేడీస్ హాస్టల్సే టార్గెట్.. ఏకంగా 150 కోట్ల టర్నోవర్!
ఏకంగా సోలార్ అమర్చి..
కాకినాడ జిల్లాలోని( Kakinada district) అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు ఆటో నడుపుతూ జీవిస్తుంటాడు. డీజిల్ ఖర్చు పెరుగుడంతో మూడు నెలల కిందట ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశాడు. నెలరోజులు తిప్పగా ఇంటికి గతంలో వచ్చే కరెంటు బిల్లు రెట్టింపు అయింది. దీంతో కరెంట్ బిల్లు పెరిగితే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని భావించిన భాస్కరరావు ఒక కొత్త ఆలోచన చేశాడు. కరెంటు బిల్లు బెడద లేకుండా సోలార్ ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు ఒక సోలార్ టెక్నీషియన్ గా ఉన్నారు. ఆయన సాయంతో ఆటో పైభాగాన 48 ఓల్ట్స్, 580 వాట్స్ ఉన్న సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. సోలార్ ఆటో గా మార్చేశారు. ఇందుకుగాను ఆయనకు 30 వేల రూపాయలు ఖర్చు అయ్యింది. ఒకసారి ఆటో పై ఉన్న సోలార్ ప్యానల్స్ తో చార్జింగ్ చేస్తే.. ఏకంగా ఎనిమిది గంటలపాటు ఆటో నిరంతరాయంగా ప్రయాణించవచ్చు. దీంతో కరెంటు బిల్లు బాధ తప్పిందని భాస్కరరావు చెబుతున్నాడు. భాస్కరరావు ఐడియా నచ్చిన చాలామంది ఇప్పుడు ఆటోలకు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసే పనిలో పడ్డారు.