YCP: సంక్షేమంతో పాటు అభివృద్ధి తమకు రెండు కళ్ళు అని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు అలా భావించడం లేదు. సంక్షేమం సరే.. అభివృద్ధి ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. నేరుగా వైసిపి ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. తమఅధినేత మాదిరిగా చెబితే.. ప్రజలు ఎక్కడ తిరగబడతారోనని తెలివిగా మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. మీకు అభివృద్ధి కావాలా? అయితే సంక్షేమం విషయం మరిచిపోండి అంటూ తెగేసి చెబుతున్నారు. ప్రజలను డిఫెన్స్ లో పడేస్తున్నారు. వారిని వ్యూహాత్మకంగా సైలెంట్ చేస్తున్నారు. అయితే ఇది ఇలానే కొనసాగితే.. సైలెన్స్ కాస్త వైలెన్స్ గా మారే అవకాశం ఉంది.
మొన్న ఆ మధ్యన వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రజలు రోడ్లు కావాలని అడుగుతున్నారని.. నిధులు ఎక్కడివని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ఏదో ఒక పథకం నిలిపివేస్తే అద్దాల్లాంటి రోడ్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించవచ్చు అని తేల్చేశారు. మీకు పథకం కావాలా? రోడ్లు కావాలా? అంటూ ప్రజలకు లాజిక్ ప్రశ్న వేశారు. ఇప్పుడు కొడాలి నానినే మంత్రులు, ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నారు. గొంతెమ్మ కోరికలు అడుగుతున్న ప్రజలకు చక్కగా సమాధానం చెప్పి.. తిప్పి పంపుతున్నారు. అయితే ఈ తరహా పదప్రయోగం వికటించే అవకాశాలే ఎక్కువ. అయితే ఇది తెలియని వైసీపీ సీనియర్లు సైతం కొడాలి నానినే అనుసరిస్తున్నారు.
విశాఖలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్ల కోసం జగన్ను వదులుకోవద్దని సలహా ఇచ్చారు. రోడ్లు వస్తాయి.. పోతాయి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ పోతే రారని అర్థం వచ్చేలా మాట్లాడారు. అసలు రవాణా వ్యవస్థ అవసరమే లేదని ధర్మాన తేల్చేశారు. సంక్షేమ పథకాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని.. అందుకే జగన్ కు మరోసారి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలతో జగన్ రహదారుల నిర్మాణం మాటనే మరిచిపోయారని ధర్మాన ఒప్పుకున్నట్లు అయ్యింది.
తాజాగా సత్యసాయి జిల్లాలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. తనకల్లు మండలం చిన్న రామన్న గారిపల్లి లో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పర్యటించారు. తమ గ్రామానికి రోడ్డు బాగు చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరారు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే సిద్ధారెడ్డి స్పందించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నియోజకవర్గంలో ప్రతినెల 15 కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నామని.. ఒక నెల పింఛన్లు నిలిపివేస్తే.. నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు అద్దాల్లా మెరిసిపోతాయని ఎమ్మెల్యే బదులు ఇవ్వడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడ నుంచి జారుకున్నారు. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో రహదారులు నిర్మించకుండా.. వైసీపీ ప్రజా ప్రతినిధులు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే మాత్రం.. ప్రజలు అదే స్థాయిలో బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అధినేత జగన్ సంక్షేమం, అభివృద్ధి అని చెబుతుండగా.. వైసిపి ప్రజాప్రతినిధులు మాత్రం అభివృద్ధి కావాలంటే.. సంక్షేమాన్ని వదులుకోవాలని సూచిస్తుండడం విశేషం.