Kadapa Mahanadu violence : కడపలో టీడీపీ మహానాడు విజయవంతం కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందా? అందుకే ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతోందా? అందులో భాగంగానే టీడీపీ ఫ్లెక్సీలను ఆ పార్టీ నేతలు చించివేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు కడప వేదికగా టీడీపీ మహానాడు జరిగిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. మూడు రోజుల పాటు వేడుగా కార్యక్రమాలు జరిగాయి. కడప వేదికగా టీడీపీ శ్రేణులు గర్జించాయి. గురువారం సాయంత్రంతో కార్యక్రమాలు ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో టీడీపీ నాయకులతో పాటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఉన్నట్టుండి టీడీపీ ఫ్లెక్సీలు చించివేతకు గురికావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదైంది.
Also Read : లోకేష్ కాదు జూనియర్ ఎన్టీఆర్..లక్ష్మీపార్వతి లాజిక్ పాయింట్
కూటమి పట్టుబిగించడంతో..
సాధారణంగా కడప అంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుంది. అక్కడ ప్రత్యర్థులు వణికిపోయేలా పరిస్థితి ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆధిపత్యం ఎక్కువగా సాగేది. పార్టీలతో సంబంధం లేకుండా.. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఆ కుటుంబ కనుసన్నల్లోనే జిల్లాలో రాజకీయ కార్యకలాపాలు నడిచేవి. అటువంటిది ఈ ఎన్నికలతో కుటుంబ ప్రభ తగ్గింది. వివేకానందరెడ్డి హత్య, జగన్ తో సోదరి షర్మిళ విభేదించడం వంటి కారణాలతో వైఎస్ కుటుంబానికి క్రమేపీ పట్టు తగ్గింది. 2024 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. 10 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడింటికే పరిమితమైంది. అప్పటి నుంచి కూటమి పట్టుబిగుస్తూ వస్తోంది.
ఎంపీ అవినాష్ పీఏ ఏ1గా..
అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండవచ్చు.. కానీ ఆ పార్టీకి గ్రామగ్రామాన బలమైన కేడర్ ఉంది. ఇప్పటికీ ఉరకలేసే ఉత్సాహం వారిలో ఉంది. కానీ కేసుల భయంతో చాలామంది వెనక్కి తగ్గుతున్నారు. అయితే తాజాగా మహానాడు నిర్వహించి జగన్ అడ్డాలోనే సత్తా చాటామని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారని ఫిర్యాదులు రావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ 15 మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, పులివెందుల మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ ఉన్నారు. ఏ1గా రాఘవరెడ్డి, ఏ5గా వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది.