Jr .NTR : నారా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణలతో ఎన్టీఆర్ చాలా ఏళ్లుగా డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారు. కొన్ని కీలక రాజకీయ అంశాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు, హరికృష్ణ, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ వ్యవహారాల్లో పాల్గొనడం మానేశారు. అదే సమయంలో బాలయ్య-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన మొదలైంది.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఎన్టీఆర్ రాజకీయంగా క్రియాశీలకం కాలేదు. బాబు, బాలయ్యలతో ఆయన సాన్నిహిత్యం పాటించలేదు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ని ఖండించాలని ఎన్టీఆర్ పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. కానీ ఎన్టీఆర్ నోరు మెదపలేదు. తాతయ్య శతజయంతి వేడుకలకు ఆహ్వానించినా వెళ్ళలేదు.
ఇటీవల జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో సైతం ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, బాలయ్యలతో కలవాలని ఎన్టీఆర్ భావించడం లేదనే వాదన బలపడింది. నందమూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. దేవర మూవీపై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టీడీపీ వర్గాలు దుష్ప్రచారం చేయడం మనం చూడొచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని ఎన్టీఆర్ కలవడం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. హీరోలు ప్రభుత్వాలకు మద్దతుగా ఆర్థిక సహాయం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ఏపీ-తెలంగాణాలకు చెరో రూ. 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏపీకి ప్రకటించిన మొత్తానికి సంబంధించిన చెక్ ని స్వయంగా చంద్రబాబుకు అందించేందుకు ఎన్టీఆర్ వస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా చంద్రబాబును కలవనున్నారు.
ఇన్నేళ్ల తర్వాత చంద్రబాబును ఎన్టీఆర్ కలవడానికి కారణం దేవర సినిమాను కాపాడుకోవడానికే అని తెలుస్తుంది. దేవరపై టీడీపీ వర్గాలతో పాటు బాలయ్య ఫ్యాన్స్ లో ఉన్న వ్యతిరేకత కొంత మేర తగ్గించినట్లు అవుతుంది. అదే సమయంలో ఏపీలో దేవర విడుదలకు అడ్డంకులు ఏర్పడవు. టికెట్స్ ధరల పెంపుకు అనుమతి లభించే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్టీఆర్-చంద్రబాబుల భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
Web Title: Junior ntr will meet ap cm chandrababu naidu today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com