Investments in AP : ఏపీకి గుడ్ న్యూస్. రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. తాజాగా భారీ పెట్టుబడి ఒకటి వచ్చింది. రాష్ట్రంలో వేలకోట్ల పెట్టుబడికి జపాన్ సంస్థ ముందుకు వచ్చింది. కర్నూలులోని ఓర్వకల్లు లో ఉన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషం. 130 ఎకరాల సువిశాల ప్రాంగణంలో.. 14 వేల కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జపాన్ సంస్థ.. మన దేశానికి చెందిన ఐటీ సంస్థతో కలిసి ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జపాన్ నుంచి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కును సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను అంచనా వేశారు. అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదయోగ్యమని తేల్చేశారు. పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేశారు.
* లోకేష్ సమక్షంలో చర్చలు
అమరావతిలో సంబంధిత కంపెనీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. పరిశ్రమల శాఖ మంత్రి పిజి భరత్ సమక్షంలో చర్చలు జరిపారు. ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా పదివేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. సంబంధిత కంపెనీ ప్రతినిధులు మంత్రులతో జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. జనవరి రెండో వారంలో ఈ కంపెనీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే దేశంలోనే ఇదో గుర్తింపు పొందనుంది. అతి పెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి ఎగుమతులకు అవకాశం ఉంటుంది.
* తాజాగా రెండు ఒప్పందాలు
ఈ పరిశ్రమ నిర్వహణకు సంబంధించి విద్యుత్ భారీగా అవసరం ఉంటుంది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు అయ్యే సోలార్, విండ్ పవర్ కేంద్రాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రెండు కీలక సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. డీప్ టక్ అభివృద్ధిలో భాగంగా పిడబ్ల్యూ ఎడ్యుటెక్ కంపెనీ తన ఇండస్ట్రీ పార్ట్నర్ అమెజాన్ వెబ్ తో కలిసి ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. మరోవైపు టోనీ బ్లేయర్ ఇనిస్టిట్యూట్ తో మరో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నత విద్యను ఆధునికీకరించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాల్లో మంత్రి లోకేష్ కీలకంగా వ్యవహరించారు. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మాత్రం జనవరిలో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.