Pawan Kalyan
Pawan Kalyan: పదేళ్ల కిందట జనసేన ఆవిర్భవించింది. ఎంతోమంది యువకులు పవన్ వెంట అడుగులు వేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదగాలని తపనతో పని చేసిన వారు ఉన్నారు. పవన్ ఇమేజ్ తో తాము కూడా రాజకీయంగా ఎదగాలని ఆశ కూడా ఎక్కువమందిలో కనిపించింది. ఇలాంటివారు గత పదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. కానీ ఇటువంటి వారి ఆశలను పవన్ తుంచేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ కు రెడీమేడ్ నేతలు దొరుకుతున్నారు. చంద్రబాబు పంపినవారు, వైసీపీ వద్దనుకున్న వారికి ఇప్పుడు పవన్ టికెట్లు ఇస్తుండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిలు ఇద్దరు జనసేనలో చేరారు. వారే జనసేన అభ్యర్థులవుతారని ప్రచారం జరుగుతోంది.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాలను తప్పించి.. మిగతా వాటికి పవన్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే చాలా చోట్ల టిడిపి నుంచి వచ్చిన వారికి, వైసిపి వద్దన్న వారికి సీట్లు కేటాయించారు. గత ఎన్నికల్లో పవన్ భీమవరం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు పోటీ చేశారు. ఇప్పుడదే రామాంజనేయులు జనసేనలో చేరి టికెట్ దక్కించుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో జనసేనలో చేరి తిరుపతి సీటును దక్కించుకున్నారు.
విశాఖకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీలో ఉండేవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించారు. కానీ జగన్ కేటాయించలేదు. వైసిపి అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. ఎన్నికల్లో వైసీపీ సీటు కేటాయించకపోవడంతో జనసేనలో చేరారు.విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు.మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సీటు ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు.
తాజాగా అవనిగడ్డ టిడిపి ఇంచార్జ్ మండలి బుద్ధ ప్రసాద్, పాలకొండ టిడిపి ఇన్చార్జ్ నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. జనసేన పొత్తులో భాగంగా ఈ రెండు స్థానాలను దక్కించుకుంది. అక్కడ అభ్యర్థులను ఇంతవరకు ప్రకటించలేదు. వీరిద్దరినీ చేర్చుకొని టిక్కెట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే పవన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. వైసీపీ లేదా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు జనసేనలో చేరడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ మిత్రపక్షమైన టిడిపి నాయకులను ఏ విధంగా చేర్చుకుంటారు? ఎలా టిక్కెట్లు కేటాయిస్తారు? దీనిని ఎలా సమర్థించుకుంటారో? ఆయనకే తెలియాలి. జనసేన రిమోట్ చంద్రబాబు వద్ద ఉందని.. ఆయన ఎలా రిమోట్ చేస్తే అలా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే టిడిపి నేతలు పార్టీలో చేరడం, వారికి టిక్కెట్లు కేటాయించడం జరిగిపోతోంది. గత పదేళ్లుగా జండా మోసిన జనసైనికుడికి మాత్రం న్యాయం జరగడం లేదు. మరి ఈ ప్రతికూలతలను పవన్ ఎలా సమర్థిస్తారు? ఎలా ఎదుర్కొంటారో? ఆయనకే ఎరుక.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Janasena tickets for tdp leaders how will pawan kalyan defend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com