Mahasena Rajesh: తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా పనిచేసిన నేతలకు టిక్కెట్లు దక్కలేదు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. కానీ కొందరు అనూహ్యంగా టిక్కెట్లు సొంతం చేసుకున్నారు. ఊహించని విధంగా కొంతమంది జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల దృష్ట్యా వారికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అటువంటి వారికి టిక్కెట్లు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్ లకు చోటు దక్కడంపై టిడిపి సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. సీనియర్ నేతలను సైతం స్థానం దక్కని తొలి జాబితాలో వీరి పేర్లు ఉండడం రాజకీయ వర్గాల్లో సైతం ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
అయితే ఇందులో కొలికపూడి శ్రీనివాసరావు విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవు. గతంలో ఈయన సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు. తరువాత అమరావతి రైతు ఉద్యమంలో కీలకంగా మారారు. ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు. ఇటీవలే కొలికపూడి తెలుగుదేశం పార్టీలో చేరారు. తిరువూరు టికెట్ దక్కించుకున్నారు. అక్కడ టిడిపి ఇన్చార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామి దాసు వైసీపీలో చేరిపోవడంతో.. కొలికపూడికి లైన్ క్లియర్ అయింది. తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పోటీ లేకుండా పోయింది.
అయితే మహాసేన రాజేష్ విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టిడిపి తో పాటు జనసేన సైనికుల నుంచి వ్యతిరేకత ఉంది. ఇటీవల జాబితాల వెల్లడిలో మహాసేన రాజేష్ పేరు ఉంది. పి. గన్నవరం టికెట్ ను ఆయనకు కేటాయించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా మహాసేన రాజేష్ పని చేశారు. ఆ పార్టీకి ప్రచారం కూడా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్ లో వైసీపీ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా ఆయన ఫేమస్ అయ్యారు. తొలుత ఆయన జనసేనలోకి వెళతారని టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. టికెట్ దక్కించుకున్నారు.
అయితే మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా జనసైనికులు వ్యతిరేకిస్తున్నారు. టిడిపిలో వర్గం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన సమన్వయ సమావేశం కొట్లాటకు దారితీసింది. హరీష్ మాధుర్ అనే టిడిపి నేత కారు ధ్వంసం అయింది. మరోవైపు మహాసేన రాజేష్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. గతంలో చంద్రబాబుతో పాటు పవన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు వైరల్ చేస్తున్నారు. ఇక్కడ జనసేన బలంగా ఉందని.. టిడిపి నేతకు టికెట్ ఎలా కేటాయిస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే టిడిపి టికెట్ ను ఈజీగా దక్కించుకున్న మహాసేన రాజేష్.. టిడిపి, జనసేన శ్రేణుల అభిమానాన్ని దక్కించుకోలేకపోవడం విశేషం. మరి దీనిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.