Chandrababu Naidu : నాడు అలా.. నేడు ఇలా.. చంద్రబాబులో ఎంత మార్పు.. ఆయనే కారణమా?

ఏ ఎన్నికలు వచ్చినా.. రాజకీయా పార్టీలు తమ బలం మేరకు పోటీ చేస్తాయి. అభ్యర్థులను బరిలో నిలుపుతాయి. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు అన్ని పార్టీలు ఇదే విధానం అవలంబిస్తాయి. కొన్ని పార్టీలు రాష్ట్రానికి పరిమితమైతే.. కొన్ని పార్టీలు జాతీయ స్థాయిలో తలపడతాయి.

Written By: Raj Shekar, Updated On : August 14, 2024 8:18 pm

Chandrababu Naidu

Follow us on

Chandrababu Naidu :  తెలుగు రాష్ట్రాల్లో సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబునాయుడు.. ఇప్పుడు విభజిత ఏపీకి కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోను గతంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కలకంగా ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడులో ప్రస్తుతం చాలా మార్పు కనిపిస్తోంది. విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓటుకునోటు కేసుతోపాటు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన గతంలో ఏ ఎన్నికలు వచ్చినా బలా బలాలతో సంబంధం లేకుండా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపేవారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి పోటీ చేయించేవారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలో పార్టీని ఉండేలా చూసుకునేవారు. కానీ, ప్రస్తుతం చంద్రబాబు నాయుడులో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ ఉమ్మడి విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడమే. గతంలో చంద్రబాబునాయుడు ఇలా ఆలోచించేవారు కాదు, ఎన్నిక ఏదైనా సరే.. బలం ఉందా.. లేదా అనేదానితో పని లేదు.. పోటీకి పెట్టేవారు. కానీ, ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అయినా కూడా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలుపలేదు. గతంలో పోటీ చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు తప్పుకోవడం ద్వారానే సానుకూలత సాధించుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చిన మొదటి ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపకపోగా, తమకు బలం లేదు కాబట్టి విలువలను కాపాడేందుకు పోటీ నుంచి తప్పుకున్నామన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా చూసుకున్నారు.

బలం లేకనే…
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 600 ఓట్లకుపైగా బలం ఉంది. టీడీపీకి కాస్త అటూ ఇటుగా 200 ఓట్లు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య ఓట్లతో భారీ వ్యత్యాసం ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమే. ఈనేపథ్యంలో అధికార టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిపితే.. ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో అధికారంలో ఉండి ఓడిపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఈ నేపథ్యంలో హుందాగా తప్పుకోవడం ద్వారా సానుకూలత పొందవచ్చన్న ఆలోచన చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలోనే పోటీ చేయడం లేదని హుందాగా ప్రకటించారు.

బాబు మారిపోయారు సార్‌..
సాధారణంగా చంద్రబాబు నాయుడు బలంతో పని లేకుండా ఎన్నికల్లో పోటీకి ఎప్పుడూ సై అంటారు. కాని రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రాలో పోటీచేశారు. ఆంధ్రాలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కూడా చెప్పుకోదగిన సీట్లు సాధించారు. కానీ, తర్వాత తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో చంద్రబాబు నాయుడు 2018 ముందస్తు ఎన్నికల్లో మరోమారు కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేశారు. కానీ, ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ బలహీనపడడంతో పోటీ చేయలేదు. ఇక తాజాగా ఏపీలో అధికారంలో ఉన్నారు. అయినా విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో తమకు బలం లేదని పోటీ నుంచి తప్పుకున్నారు.

ఎందుకీ మార్పు..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఈ మార్పుకు ప్రధాన కారణం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన పాలన అందిస్తాను అని చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో నిలబడక పోవడం వలన వచ్చే చెడు కంటే. ఎన్నికల్లో నిలబడి గెలిచినా.. ఓడినా వచ్చే అప్రతిష్టే ఎక్కువ ఉంటుందని కూటమిలో కీలక భాగస్వామి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సూచించినట్లు తెలుస్తోంది. పవన్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు తన సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.