Janasena National Party: పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన ఆలోచన శైలి జాతీయ భావాలకు దగ్గరగా ఉంటుంది. దీనిపైనైనా సూక్ష్మంగా ఆలోచన చేస్తారు పవన్ కళ్యాణ్. జనసేన నుంచి అవకాశాలు దక్కించుకున్న ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. పదవి అంటే బాధ్యత అని గుర్తు చేసేలా ఈ సమావేశం కొనసాగింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు, పార్టీ పదవులు దక్కించుకున్న వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. పదవి అంటే బాధ్యత అన్న విషయాన్ని గుర్తించుకోవాలని వారికి సూచించారు. మనం ఎంచుకునే మార్గం, పనిచేయాలనుకున్న మార్గం స్పష్టంగా ఉండాలని సూచించారు. నక్సలైట్లు కూడా ఒక మంచి ఆలోచనతోనే ఉద్యమంలోకి వెళ్లారని.. జనసైనికులు కూడా మంచి ఉద్దేశంతో పార్టీలో పని చేయాలని సూచించారు. మిగతా రాజకీయ పార్టీలకు జనసేన భిన్నం అని చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ మాదిరిగా జనసేన బలపడాలన్నదే తన అభిమతంగా చెప్పుకొచ్చారు పవన్. అందుకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
* పదవులు అంటే బాధ్యత అని..
పదవులు అంటేనే బాధ్యత అని గుర్తుచేసి తాను నామినేటెడ్ పదవులు ఇచ్చిన విషయాన్ని చెప్పారు. ఎక్కడో ఉన్న కోరికన రవికుమార్ కు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ( SriSrikakulam kakulam Urban Development Authority ) చైర్మన్ పదవి ఇచ్చానని.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడెక్కడో ఉన్న నిజాయితీపరులను గుర్తించి.. వారి అవసరాన్ని గుర్తెరిగి పదవులు కట్టబెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఒక మంచి ఆశయంతో పనిచేస్తే ఫలితం దానంతట అదే దక్కుతుందని చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీకి ప్రారంభంలో రెండు పార్లమెంట్ స్థానాలే ఉండేవని.. కానీ ఈనాడు దేశవ్యాప్తంగా విస్తరించిన వైనాన్ని గుర్తు చేశారు. జనసేనకు కూడా అదే మాదిరిగా విజయం ప్రారంభంలో దక్కలేదని.. పూర్తిస్థాయిలో ప్రజల్లో పనిచేశాక ఈ ఫలితం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. జనసేన అంటే తాను ఒక్కడినే కాదని.. కిందిస్థాయి నేతల నుంచి అందరూ గట్టిగా నిలబడితేనే ఈ ఫలితం వచ్చిందని చెప్పుకొచ్చారు.
* ఆటుపోట్లను తట్టుకొని..
పవన్ కళ్యాణ్ చెబుతోంది నిజమే. ఎందుకంటే ఆ పార్టీకి ఎదురైన పరిణామాలు మరో రాజకీయ పార్టీకి ఎదురు కాలేదు. తొలి ఎన్నికల్లో రెండు పార్టీలకు మద్దతు తెలిపారు. అటు తరువాత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. రెండు చోట్ల పవన్ ఓడిపోయారు కూడా. ఈ తరుణంలో ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారు. వాటిని తట్టుకుని నిలబడగలిగారు పవన్ కళ్యాణ్. అయితే ఎమ్మెల్యేల ఎంపిక కూడా పవన్ కళ్యాణ్ కు సాహసమే. అలా టిక్కెట్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ శత శాతం విజయం సాధించిన తర్వాత కూడా అనేక రకాలుగా సవాళ్లు ఎదురయ్యాయి. అయితే నామినేటెడ్ పదవుల ఎంపికలో మాత్రం చాలా అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి అనేది అక్కరలేని నాయకులను మాత్రమే ఎంపిక చేసి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. అయితే జాతీయస్థాయిలో జనసేన పార్టీని నిలబెట్టాలి అనేది పవన్ తాపత్రయంగా తెలుస్తోంది. కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా జనసేన ను ఉంచకుండా.. జాతీయస్థాయిలో విస్తరించాలన్న ఆలోచన ఆయనలో ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఇతర రాష్ట్రాలను తరచు సందర్శిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అనే అంశాన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు తన పార్టీలో పని చేస్తున్న వారికి పదవులు ఒక బాధ్యత అని సూచిస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతంగా.. ఒక పద్ధతి ప్రకారం జనసేన ను విస్తరిస్తుండడం మాత్రం అభినందించదగ్గ విషయం.