Jagan Birthday: జీవహింస అనేది ఒక తప్పు. కానీ దానిని కూడా ఒక వేడుకగా జరుపుకున్నారు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఆయన చిత్రపటం వద్ద జంతువధ చేసి.. ఆయన ఫోటోకు రక్తాభిషేకం చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జీవ కారుణ్య చట్టాల కింద వారిని అరెస్టు చేశారు. వీధుల్లో నడిపిస్తూ తీసుకెళ్లి తాట తీశారు పోలీసులు. మరోసారి అటువంటి తప్పిదాలకు ఇతరులు పాల్పడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానుల అతి ఉత్సాహానికి ఇటువంటిది ఒక గుణపాఠమే.
* అందరిదీ అదే దూకుడు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దూకుడు కలిగిన శ్రేణులు అధికం. పార్టీ అధినేత నుంచి కింది స్థాయి వరకు అదే దూకుడు. ప్రజలను దగ్గర చేసింది ఆ దూకుడు. అదే దూకుడుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది కూడా. ఇటీవల పుష్ప డైలాగ్ రప్ప.. రప్పాను అనుసరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడే రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా అదే డైలాగుతో గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు. అరెస్టుల పర్వంతో పాటు హింస తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళుతుంది కూడా. అయితే వైసీపీ సీనియర్లు ఇదే విషయంపై ఆందోళనతో ఉన్నారు. కానీ పార్టీలో ఆ వైఖరి మాత్రం తగ్గడం లేదు.
* ఫోటోకు రక్తాభిషేకం..
ఇటీవల జగన్ జన్మదినం నాడు ఓ వీడియో సోషల్ మీడియాలో( social media) వైరల్ అయింది. అనంతపురం జిల్లాలో ఓ వైసీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జగన్ ఫ్లెక్సీ ముందు ఓ మూగ జీవిని చంపి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకు అభిషేకం చేశారు. సాధారణంగా మేకలతో పాటు గొర్రెలను చంపి మాంసంగా తింటుంటారు. కానీ ఓ ఫోటో ముందు వేడుకగా జీవహింసను చేయడం.. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి వాటిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జీవ కారుణ్య చట్టానికి వ్యతిరేకంగా భావించి సదరు సర్పంచ్ తో పాటు వైసీపీ శ్రేణులను అరెస్టు చేశారు. రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కు. కోర్టు వారికి రిమాండ్ కూడా విధించింది. ఇది ఒక విధంగా మంచిదే. మరోసారి రాజకీయ పార్టీల ముసుగులో ఇటువంటివి చేసేందుకు ఎవరు ముందుకు రారు కూడా.