Pawan Kalyan: జనసేన అధినేత పవన్ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని ఆక్షేపించారు. కనీసం తమను సంప్రదించకుండా టిడిపి అభ్యర్థులను ప్రకటించడం పై బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అది సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. తాము కూడా ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరికలు పంపారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు అగాధం ఏర్పడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయం పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం రెండు పార్టీల్లో గందరగోళానికి దారితీసింది.
చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రా కదలిరా పేరుతో ఈ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఒక సభను నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించే క్రమంలో టిడిపి అభ్యర్థిపై పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మండపేటతో పాటు అరకులో టిడిపి అభ్యర్థులను ప్రకటించారు. దీనిపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా మండపేట నియోజకవర్గం విషయంలో చంద్రబాబు నిర్ణయం పై జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని పవన్ ప్రస్తావించడం విశేషం.
పొత్తులో ఉన్నప్పుడు మిత్ర ధర్మం పాటించాలి. కానీ టిడిపి అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. లోకేష్ సీఎం పదవి పై మాట్లాడిన మౌనంగా ఉన్నా, వాళ్లు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది అని పవన్ ప్రకటించారు. అంతటితో ఆగని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ” బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ.. తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నాం. ఇందుకు పార్టీ నేతలు నన్ను క్షమించాలి. 50, 70 స్థానాలు తీసుకోవాలంటే నాకు తెలియనివి కావు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ.. అధికారంలోకి వస్తామో రామో తెలియదు. పవన్ జనంలో తిరగడు. వాస్తవాలు తెలియవని కొందరు అంటారు. తెలియకపోతే రాజకీయాల్లోకి ఎలా వస్తాను? ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం. విడదీయడం తేలిక. అందుకే నాకు నిర్మించడం ఇష్టం” అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అటు బిజెపి సైతం కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన వంటివి రెండు పార్టీల నేతలు కలిసి విడుదల చేయాలన్నది నిర్ణయం. కానీ చంద్రబాబు ఎక్కడికి అక్కడే అభ్యర్థులను ప్రకటిస్తుండడంపై జనసేనలో అసహనం వ్యక్తం అవుతోంది. జిల్లాల నాయకులు అధినేతకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక హెచ్చరిక జారీ చేయాలని పవన్ భావించారు.అందుకే మీరు రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తే.. మేము కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తామని పవన్ తేల్చి చెప్పారు. పొత్తులో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని.. చంద్రబాబుకు గట్టి సంకేతాలే పంపారు. దీనిపై చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.