https://oktelugu.com/

Janasena Party : జనసేన సభ్యత్వాలు అదుర్స్.. ఒకేసారి లక్షల్లో.. ఎలా సాధ్యం?

మొన్నటి వరకు జనసేన ఒక ఫెయిల్యూర్ పార్టీ. పవన్ ఒక విఫల నేత. జనసేన ను ఒక పార్టీగా గుర్తించేందుకు కూడా ప్రత్యర్థి ఇష్టపడలేదు. అటువంటి పార్టీకి ఇప్పుడు ఆదరణ అమాంతం పెరగడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : August 5, 2024 12:11 pm
    Follow us on

    Janasena Party : జనసేన ది సుదీర్ఘ నేపథ్యం. 2014లో జనసేన ఆవిర్భవించింది.కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపికి మద్దతు ప్రకటించింది.అప్పట్లో ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఇక జనసేనకు తిరుగు లేదని అంతా భావించారు. కానీ ఎన్నడూ రాజకీయ ప్రయోజనాలను ఆశించలేదు పవన్. రెండు చోట్ల తాను మద్దతు ప్రకటించిన పార్టీలు అధికారంలో ఉన్నా పదవులు ఆశించలేదు పవన్. అలాగని పవర్ పాలిటిక్స్ కూడా చేయలేదు. సమాజంలో ఒక రకమైన మార్పు తీసుకురావాలని పవన్ భావించారు. జనసేన పార్టీ విషయంలో సైతం అంకితభావంతో పనిచేసే వారికి స్థానం ఉంటుందని చెప్పుకొచ్చారు. అందుకే పార్టీలోకి చాలామంది వచ్చారు. బయటకు వెళ్లిపోయారు. కానీ పవన్ ను అభిమానించే, జనసేన ఆశయాలకు ఆకర్షితులయ్యే జనసైనికులు మాత్రం ఇప్పటివరకు పార్టీలోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో సీరియస్ గా పని చేశారు. అందుకే జనసేనకు సంపూర్ణ విజయం. కూటమికి ఏకపక్ష గెలుపు. అయితే ఎన్నికల తరువాత జనసేనకు విశేష ఆదరణ పెరుగుతోంది. అందుకు సభ్యత్వ నమోదు ఉదాహరణ. పది లక్షలకు పైగా సభ్యత్వ నమోదు తో జనసేన దూసుకుపోతోంది. వేలాదిమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. 500 రూపాయల నగదు ఇచ్చి మరి పార్టీలో చేరుతున్నారు. గత నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభమైంది. జూలై 31 తో ముగిసింది. అయితే వస్తున్న ఆదరణ చూసి సభ్యత్వ నమోదు ప్రక్రియను ఈరోజు వరకు పొడిగించారు. కానీ రికార్డ్ స్థాయిలో పది లక్షలకు సభ్యత్వ నమోదు దాటడం విశేషం.

    * ప్రారంభంలో ఆరు లక్షలే
    జనసేన ఆవిర్భావ సమయానికి ఆ పార్టీకి ఆరు లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో జనసైనికులపై ఒక రకమైన అపవాదు పడింది. కేవలం సినీ నటుడు గానే పవన్ అంటే అభిమానిస్తున్నారని.. ఓటు విషయానికి వచ్చేటప్పుడు తప్పటడుగులు వేస్తున్నారని కామెంట్స్ వినిపించేవి. చివరకు పవన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిమానులు ఓటర్లుగా మారడం లేదని.. కేవలం సభలకు హాజరైనంత మాత్రాన ఏమి ఒరగదని.. అభిమానం ఓటు రూపంలో మారితేనే ప్రయోజనం అని చెప్పుకొచ్చారు. అందుకే ఈసారి పవన్ ఇచ్చిన పిలుపునకు జనసైనికులు ఆలోచన చేశారు. ఏకపక్షంగా మద్దతు తెలిపారు. బాధ్యతగా ఓటు వేసి గెలిపించారు.

    * స్వచ్ఛందంగా ముందుకొచ్చి
    ప్రస్తుతం జనసేన సభ్యత్వం తీసుకుంటున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారే. ఇంకా జనసేన చేరికలకు ప్రోత్సహించడం లేదు. గేట్లు తీసిన మరుక్షణం వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయి. అయితే గత ఐదేళ్లుగా జనసైనికులను వేధించిన వైసీపీ శ్రేణులను పార్టీలోకి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు పవన్ కు తెలుసు. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి చేరిన వారి విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

    * పెరగడానికి ఇవే కారణాలు
    అయితే తాజాగా జనసేన సభ్యత్వాలు రికార్డు స్థాయిలో పెరగడం పై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. ఎన్నో అవమానాలు, చీత్కారాల తర్వాత పవన్ విజయాన్ని అందుకోగలిగారు. పవన్ చాలా విషయాల్లో బాధ్యతగా వ్యవహరించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా సైతం బాధ్యతగా పదవి నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ తటస్థులకు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల్లో సైతం జనసేనకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. దీంతో జనసేన సభ్యత్వాలు పెరుగుతున్నాయి. రికార్డులు సృష్టిస్తున్నాయి.