YSR Congress : ఉమ్మడి గుంటూరు( Guntur district) జిల్లాలో ప్రయోగాలకు దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చాలని భావిస్తున్నారు. కీలక నియోజకవర్గాల విషయంలో వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చారు. ఆయనను గుంటూరు పార్లమెంటు స్థానానికి బదలాయించారు. మరోవైపు నరసరావుపేట పై మరో బాంబు పేల్చారు. అక్కడ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డిని మార్చేస్తారని ప్రచారం నడుస్తోంది. అక్కడ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కాసు కుటుంబానికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం
నరసరావుపేట ( Narasaraopeta ) అంటే ముందుగా గుర్తొచ్చేది కాసు బ్రహ్మానంద రెడ్డి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. అటు తరువాత కాసు వెంకట కృష్ణారెడ్డి మూడుసార్లు నరసాపురం నుంచి గెలిచారు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఆ పార్టీ హవా నడిచిందని చెప్పవచ్చు. దివంగత నేత కోడెల శివప్రసాదరావు 1983 నుంచి 1999 వరకు ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చారు. అయితే 2004 నుంచి సీన్ మారింది.
* సీన్ మారింది
2004లో రాజశేఖర్ రెడ్డి ( Rajasekhar Reddy )పాదయాత్రతో ఇక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో సైతం అదే పార్టీ విజయం సాధించింది. 2014లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019లో సైతం శ్రీనివాస్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మూడోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు. టిడిపి అభ్యర్థి అరవింద్ బాబు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ కాసు కుటుంబాన్ని ప్రయోగిస్తారని ప్రచారం నడుస్తోంది.
*ఆ రెండు సామాజిక వర్గాలు అధికం
ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గం కూడా అధికం. వైశ్యులు కూడా ఎక్కువగా ఉన్నారు. అందుకే గతంలో కొణిజేటి రోశయ్య ఇక్కడ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ టిడిపి బలంగా ఉంది. దీంతో బలమైన నేత వైసిపికి అవసరం. అందుకే ఇక్కడ గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బరిలో దింపితే మంచి విజయం దత్తుతుందని జగన్ అంచనా వేస్తున్నారట. కాసు కుటుంబానికి నరసరావుపేట నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అందుకే ఆ కుటుంబానికి చెందిన మహేష్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
* మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటారా
ఇక్కడ ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. గత రెండుసార్లుగా గెలవడంతో ఆయనకు సైతం నియోజకవర్గంలో పట్టు ఉంది. ఒకవేళ ఆయనను కాదని కాసు మహేష్ రెడ్డికి( kaasu Mahesh Reddy ) బాధ్యతలు అప్పగిస్తే ఆయన సహకరిస్తారా? లేదా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మహేష్ రెడ్డి ని ఇక్కడ నియమించకూడదని శ్రీనివాస్ రెడ్డి హై కమాండ్ కు కోరుతున్నారు. అయితే టిడిపి దూకుడుకు చెప్పాలంటే కచ్చితంగా ఎక్కడ కాసు కుటుంబం రావాల్సిందేనని జగన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.