Former CJI sensational comments: జడ్జీలు సాధారణంగా వివాదాదస్పద వ్యాఖ్యలు చేయరు. రిటైర్ అయిన తర్వాత కూడా తాము పదవిలో ఉన్నప్పుడు జరిగిన విషయాలను బహిర్గతం చేయరు. కానీ, కొంతకాలంగా న్యాయమూర్తులు కూడా ఓపెన్ అవుతున్నారు. తాజాగా మాజీ సీజేఐ ఎన్‌వీ.రమణ కూడా తాను పదవిలోకి రాకముందు.. వచ్చిన తర్వాత ఎదుర్కొన్న ఒత్తిడులను బయట పెట్టారు. తనపై జరిగిన రాజకీయ ఒత్తిడి, కేసులను వివరించడం న్యాయ వ్యవస్థలో చర్చనీయాంశమయ్యాయి.
న్యాయమూర్తులపై ప్రతీకార రాజకీయాలు..
అమరావతి రాజధాని ఉద్యమానికి న్యాయపరంగా అండగా నిలబడటం తనపై కుట్రలకు కారణమైందని రమణ వెల్లడించారు. వైసీపీ నేతలు తన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టడం, ల్యాండ్ కొనుగోళ్లను నేరంగా చూపించడం వంటి చర్యలు రాజకీయ ప్రతీకారానికి నిదర్శనమని ఆయన తెలియజేశారు. ఆ కేసులు తుది దశలో కోర్టుల్లో రద్దు కావడం ఆ కుట్రల అసలు ఉద్దేశాన్ని బయటపెట్టిందన్నారు.
సీజేఐ రాకుండా కుట్ర..
ఇక 2020లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి న్యాయమూర్తి రమణపై అధికారిక ఫిర్యాదు చేశారు. ఆయన రాజకీయ ప్రభావం చూపుతున్నారని, హైకోర్టు తీర్పులను దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు చేశారు. సీజేఐ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశార. సుప్రీం కోర్టు అంతర్గతంగా విచారణ జరిపి వాటిని ఆధారరహితంగా తేల్చింది. ఆ తర్వాత రమణ సీజేఐ హోదాలో బాధ్యతలు స్వీకరించడం న్యాయస్వరాజ్యానికి చిహ్నంగా భావించబడింది.
అమరావతికి కోర్టుల అండ..
అమరావతి ప్రాజెక్టు నిలవడానికి హైకోర్టు తీర్పులే కారణమయ్యాయని రమణ తెలిపారు. న్యాయస్థానం గట్టి పట్టు చూపించకపోతే, రాజధాని ప్రణాళిక సంపూర్ణంగా రద్దయి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలను కాపాడిన న్యాయమూర్తులు బదిలీ కూడా అయ్యారని ప్రస్తావించారు. న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిడి ఎంత ప్రమాదకరమో రమణ గుర్తు చేశారు. న్యాయపరమైన స్వతంత్రతకు హాని చేసేదే దేశ పరిపాలనకూ బలహీనతగా మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. న్యాయ అధికారులపై కేసులు వేయడం, బదిలీలతో ఒత్తిడి తేవడం వంటి చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు.
మాజీ సీజేఐ వ్యాఖ్యలతో వైసీపీ పాలన తరహా, ఆ కాలం రాజధాని విధానాలపై చర్చ మళ్లీ మొదలైంది. న్యాయరంగంలో రాజకీయ హస్తక్షేపం జరిగినట్లు మాజీ న్యాయమూర్తి బహిరంగంగా వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కావడం విశేషం.