Homeఆంధ్రప్రదేశ్‌Jagan: మళ్లీ జగన్ తప్పటడుగు.. వైసీపీలో ఆందోళన

Jagan: మళ్లీ జగన్ తప్పటడుగు.. వైసీపీలో ఆందోళన

Jagan: వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఆ పార్టీ ఎదుర్కొంటోంది.2014లో అధికారంలోకి రాకపోయినా బలమైన పార్టీగా పునాదులు వేసుకుంది వైసిపి. ఆ పార్టీ నుంచి 23 మంది టిడిపిలోకి ఫిరాయించినా లెక్క చేయలేదు.వెన్ను చూపలేదు.అదే దూకుడుతో ముందుకు సాగింది.అధికార పక్షం పై ఫైట్ చేసింది.అంతులేని విశ్వాసంతో 2019 ఎన్నికల్లో రెండోసారి పోటీ చేసి అధికారాన్ని అందుకుంది. కానీ 2024 ఎన్నికల్లో అధికారాన్ని పదిల పరుచుకోవాలని చూసింది. కానీ నిరాశ ఎదురయింది. దారుణ ఓటమిని మూటగట్టుకుంది.అయితే గత అనుభవాల దృష్ట్యా పోరాట బాట పట్టాల్సిన జగన్.. తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారు జగన్.అంతటితో ఆగకుండా శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు.దీనిపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆందోళన చెందుతున్నాయి.అధినేత తీరు మారకపోతే కష్టమని పెదవి విరుస్తున్నాయి.

* ఎన్నికల బహిష్కరణ
ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జీవం పోసాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గత మార్చిలో జరిగాయి. అధికార పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించింది. సర్వశక్తులను ఒడ్డింది. కానీ టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అప్పటి నుంచే టిడిపికి జవసత్వాలు వచ్చాయి. పార్టీ శ్రేణులు ధైర్యంగా పోరాడడం ప్రారంభించాయి. ఇప్పుడు జగన్ కు అదే ఛాన్స్ వచ్చింది. కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మార్చిలో జరగనుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టును నిరసిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని వైసిపి నిర్ణయించింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని చెబుతున్న జగన్ ముందుగానే అస్త్ర సన్యాసం చేసినట్లు అయిందని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

* అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు
ఈనెల 11 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఎన్నో రకాల సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు జగన్.ప్రతిపక్ష నేత హోదాఇవ్వకపోవడానికి నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే జగన్ శాసనసభలో అడుగుపెట్టారు.అప్పటినుంచి రకరకాల కారణాలు చూపుతూ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు.ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరించారు.దీంతో జగన్ ఎస్కేప్ అవుతున్నారని.. శాసనసభలో గత అనుభవాల దృష్ట్యా తనకు అవమానాలు ఎదురవుతాయని భావిస్తున్నారని.. అందుకే బహిష్కరిస్తున్నారని అధికార పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. ప్రజల్లోకి సైతం అది బలంగా వెళ్తోంది. వైసీపీ శ్రేణుల్లో ఆందోళనకు అదే కారణం అవుతోంది. అధినేత తీరుపై సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular