Mudragada: అనూహ్య పరిస్థితుల్లో వైసీపీలో చేరారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. ఆయన రాజకీయ నేతగా కంటే కాపు ఉద్యమ నేతగానే ఈ రాష్ట్రానికి సుపరిచితం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా సేవలందించారు ముద్రగడ. కానీ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు.ఆ కారణంగానే పదవులకు దూరమయ్యారు.ఈ ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ముద్రగడ.కానీ పోటీ చేసేందుకు అవకాశం రాలేదు.వైసిపి తరఫున ప్రచారానికి పరిమితం అయ్యారు.వైసిపి అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉండేది.ఆ ఒప్పందంతోనే ఆయన వైసీపీలో చేరారు.పార్టీ ఓటమి చవిచూసేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎంతో ఆశలు పెట్టుకున్నారు. చివరకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని కూడా శపధం చేశారు. అదే జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటారని కూడా సవాల్ చేశారు. పవన్ గెలిచారు. టిడిపి ఘనవిజయం సాధించింది. వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. దీంతో తన పేరు మార్చుకోని తప్పని పరిస్థితి ముద్రగడకు ఎదురయ్యింది. అయితే ముద్రగడ రాజకీయాల నుంచి తప్పుకుంటారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యారు. ముద్రగడ కుమారుడికి జగన్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు.
* పార్టీలో మార్పులు
ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. దీంతో అధినేత జగన్ తో పాటు పార్టీ శ్రేణులు తీవ్ర నైరాస్యంలోకి వెళ్లిపోయాయి. ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి బయటపడుతున్నాయి. పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లుగా కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరోవైపు పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. వారి స్థానంలో కొత్త వారి నియామకాలు చురుగ్గా జరుగుతున్నాయి. అందులో భాగంగా గోదావరి జిల్లాలో తాజాగా కీలక నియామకాలు చేపట్టారు జగన్.
* టిడిపికి కంచుకోటగా
ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు. జగన్ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా పెద్దగా కనిపించలేదు ముద్రగడ. దీంతో వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. రాజకీయాలకు దూరంగా ఉంటారని కూడా విశ్లేషణలు వచ్చాయి. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ముద్రగడ పద్మనాభం కుమారుడికి పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆయనను ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు జగన్. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా విడుదలైంది. మొన్నటి ఎన్నికల్లో ప్రత్తిపాడులో వైసిపి ఓడిపోయింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల సుబ్బారావు టిడిపికి చెందిన వరుపుల సత్య ప్రభ చేతిలో ఓడిపోయారు. టిడిపికి ఇది కంచుకోట. కానీ ఈ నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ పద్మనాభం వారసుడికి అప్పగించారు జగన్.మొత్తానికైతే ముద్రగడ కుటుంబాన్ని వదులుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని స్పష్టమైంది.