Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టాలని జగన్ సర్కార్ భావిస్తోంది. కేసులో నేరుగా ఎంటర్ అవుతోంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను అక్టోబర్ మూడున విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని న్యాయ కోవిదులు, నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన జగన్ సర్కారు మరో కుట్రకు తెరలేపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. వచ్చేవారం విచారణ చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబర్ 3న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు గత తీర్పులు, ఈ కేసులో సాంకేతిక అంశాలు దృష్ట్యా సానుకూల తీర్పు వస్తుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు బలంగా నమ్ముతున్నారు. ఈ తరుణంలో జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో కెవిఎస్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు పై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో తమ వాదనలు కూడా వినాలని కోర్టుకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.
కింది కోర్టులో చుక్కెదురైన వారు హైకోర్టును ఆశ్రయిస్తారు. అలాగే కింది కోర్టులో గెలిచినవారు హైకోర్టులో కెవిఎట్. పిటిషన్ దాఖలు చేస్తారు. కెవిఎట్ అంటే కేసు వేసిన వారు అవతల పార్టీ వారికి నోటీసు ఇచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. వారి వాదనలను కోర్టు వినాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా విచారణ చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. కెవిఎట్ పిటిషన్ లైఫ్ మూడు నెలల పాటు ఉంటుంది. ఇలా చంద్రబాబు కేసు విచారణను జగన్ సర్కార్ అడ్డగించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.
అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అవినీతి లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని.. అరెస్టులో సైతం నిబంధనలో పాటించలేదని ఆరోపిస్తోంది. అయితే ఈ కేసులో చంద్రబాబు పాత్ర పై ఎన్నో ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని.. నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మార్చి కైంకర్యం చేశారని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయని గుర్తుచేస్తూ కెవిఎట్ పిటిషన్ దాఖలు చేసింది. స్వీకరిస్తే తమ వాదనలు వినిపిస్తామని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. మొత్తానికైతే అక్టోబర్ 3న కోర్టు విచారణ చేపడితే బలమైన వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి. రోజంతా విచారణ జరిగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి.
Recommended Video: