Chandrababu Jail: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ మూడు వారాలు సమీపించింది. అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ కొనసాగనుంది. కోర్టులో ఆయనకు ఊరట దక్కడం లేదు. ఆయన వేస్తున్న పిటిషన్లు విచారణకు రావడం లేదు. ఖరీదైన న్యాయవాదులను పెట్టినా చంద్రబాబుకు ఫలితం లేకపోతోందని టిడిపి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు హేళన చేస్తున్నారు. చంద్రబాబు పని అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో చంద్రబాబు న్యాయవాదులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని న్యాయ కోవిదులు చెబుతున్నారు. కేసులో బెయిల్ కంటే.. చంద్రబాబును కేసు నుంచి బయటపడేయడానికే వ్యూహాత్మకంగా వ్యవహరించాలని గుర్తు చేస్తున్నారు.
ఏ కేసులోనైనా రిమాండ్ కస్టడీ కీలకం. కేసులో బలమైన ఆరోపణలను నిరూపించుకోవడానికి దర్యాప్తు సంస్థలు నిందితుడిని జ్యూడిషియల్ కస్టడీకి కోరుతాయి. ఈ కస్టడీలో అనేక రీతుల్లో విచారణ చేపట్టి నిందితుడి పై వచ్చే ఆరోపణలను ఆధారాలతో సహా దర్యాప్తు సంస్థలు నిరూపిస్తాయి. అటు తరువాత విచారణ నివేదికలతో నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తాయి. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో మాత్రం ఆయన తరపు న్యాయవాదులు.. దర్యాప్తు సంస్థగా ఉన్న సిఐడి కి కస్టడీ సమయాన్ని తగ్గించగలిగారు. ఒక విధంగా చెప్పాలంటే సిఐడి కి బురిడీ కొట్టించారు.
నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి తెచ్చి చంద్రబాబును విచారించారు. తరువాత ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు పది రోజులు పాటు రిమాండ్ విధించింది. ఇక్కడే చంద్రబాబు న్యాయవాదులు చక్రం తిప్పారు. సాంకేతిక అంశాలను హైలెట్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ అయింది. ఈనెల 25 వరకు జాప్యం జరిగింది. అదే సమయంలో సిఐడి జ్యూడిషియల్ కస్టడీని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ, తీర్పు రిజర్వ్ లో ఉండడంతో ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోలేక పోయింది. 25వ తేదీ క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురైంది. అటు తర్వాతే ఏసీబీ కోర్టు రెండు రోజులపాటు చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఏదైనా కేసులో నిందితుడిని అరెస్టు చేసిన 15 రోజుల్లో మాత్రమే దర్యాప్తు సంస్థకు జ్యూడిషియల్ కస్టడీకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీనిని ప్రాతిపదికగా తీసుకునే చంద్రబాబు న్యాయవాదులు కావలిసే కింది కోర్టు నుంచి హైకోర్టు వరకు పిటిషన్లు దాఖలు చేశారు. హైకోర్టులో విచారణ జాప్యం జరగడం, తీర్పు రిజర్వు కావడంతో దాదాపు 13 రోజులు పాటు జాప్యం జరిగింది. ఇంకా మిగిలింది రెండు రోజులే. అందుకే సిఐడి ఏసీబీ కోర్టుకు చంద్రబాబును ఐదు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని సిఐడి కోరింది. కానీ కోర్టు మాత్రం రెండు రోజుల పాటే కస్టడీకి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు న్యాయవాదులు గుర్తు చేయడం వల్లే రెండు రోజులపాటు కస్టడీకి కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసినక్వాష్ పిటిషన్ విచారణ సమయంలో రెండు అంశాలు హైలెట్ అయ్యే అవకాశం ఉంది. 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకపోవడం, 15 రోజులు పాటు రిమాండ్ దాటిన తర్వాత విచారణ సంస్థలకు కస్టడీకి ఇవ్వకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల చుట్టూ చంద్రబాబు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. వాటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబు ఈ కేసు నుంచి ఇట్టే బయటపడతారని న్యాయ కోవిదులు చెబుతున్నారు. అదే జరిగితే జగన్ పై చంద్రబాబు పైచేయి సాధించినట్టే.