YS Jagan Foreign Tour : వైసీపీ అధినేత జగన్ లండన్ వెళ్ళనున్నారు. ఈరోజు ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా హైదరాబాదులో బయలుదేరనున్నారు. లండన్ లో ఇద్దరు కుమార్తెలు చదువుకుంటున్నారు. వీరిలో పెద్ద కుమార్తె పుట్టినరోజు ఈ నెలలోనే ఉంది. లండన్ వెళ్లేందుకు నెలరోజుల కిందటే హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. తొలుత అనుమతి ఇవ్వద్దని సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే గతంలో బెయిల్ నిబంధనలు ఉన్నా.. బ్రిటన్ సహా స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి వచ్చారని ఆయన తరుపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. అయితే అక్రమాస్తుల కేసుల్లో సాక్షులను ప్రభావితం చేయరాదని.. ఒక్క దేశానికి అనిచెప్పి మరోదేశానికి వెళ్లకూడదని.. ఈమెయిల్ ఐడి తో పాటు ఫోన్ నెంబర్ ఇవ్వాలని షరతులు విధించింది. అయితే లండన్ లో ఎక్కడికి వెళ్తున్నది చెప్పాలని కూడా ఆదేశించింది. మొత్తానికి అయితే జగన్ తో పాటు సతీమణికి విదేశాలకు వెళ్లేందుకు లైన్ క్లియర్ అయింది. కోర్టు ఆదేశాలు వచ్చిన వెంటనే వారు తమ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
* ఈరోజు ప్రత్యేక విమానంలో
ఈరోజు రాత్రికి హైదరాబాదులో ప్రత్యేక విమానంలో వారు బయలుదేరాల్సి ఉంది. కానీ ఇంతట్లో ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుంది. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేశారు. అక్కడినుంచి నిరంతరంగా వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి అర్ధరాత్రి అన్న తేడా లేకుండా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు కొలిక్కి రాలేదు. విజయవాడ నగరం పూర్వస్థితిలోకి రాలేదు. మరోవైపు బుడమేరుకు గండి పడిందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజల్లో భయం నింపుతున్నాయి.
* గోదావరి ఉగ్రరూపం
తాజాగా గోదావరి సైతం ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదీ ప్రవాహం గణనీయంగా పెరిగింది. ధవలేశ్వరం వద్ద ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. దీంతో ఏ క్షణమైనా తూర్పుగోదావరి కి ప్రమాదం పొంచి ఉందన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఇలాంటిపరిస్థితులు ఉంటే విపక్ష నేత జగన్ విదేశాలకు వెళ్లిపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విజయవాడలో వరద బాధితులను జగన్ కేవలం రెండుసార్లు మాత్రమే పరామర్శించారు. సీఎం చంద్రబాబు మాత్రం నిరంతరాయంగా అక్కడే ఉన్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతోనే ఇంతటి విపత్తు వచ్చిందని విమర్శలు ఉన్నాయి.
* వైసీపీ శ్రేణులకు ఇష్టం లేదు
అయితే ఇంతటి క్లిష్ట సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం సొంత పార్టీ శ్రేణులకు సైతం నచ్చడం లేదు. ఇది అనవసరంగా రాజకీయ విమర్శలకు దారితీస్తుంది అన్నది వారి భయం. ఇప్పటికే వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు కానీ విదేశాలకు వెళ్ళిపోతే అధికారపక్షాలకు చేజేతులా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఇప్పటికే జగన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మార్పులు ఏవైనా ఉంటే ఇప్పటికే ప్రకటన జారీ చేసేవారు. కానీ అటువంటి ప్రకటనేమీ రాలేదు. దీంతో జగన్ విదేశాలకు వెళ్లిపోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.