MLA Adhimulam Episode : ఏపీలో నేతల వ్యక్తిగత వ్యవహార శైలి వివాదాస్పదం అవుతోంది. ముఖ్యంగా కుటుంబ, వివాహేతర సంబంధాలు, వివాదాలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకు వైసిపి నేతల వ్యవహార శైలి బయటపడింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విజయసాయి రెడ్డి వ్యవహారం బయటకు వచ్చింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మీడియా ముందుకు వచ్చారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి పై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇదంతా మీడియా కుట్రగా అభివర్ణించారు. ఆ ఎపిసోడ్ ముగియగానే ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం బయటపడింది. మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, ఇద్దరు పిల్లలు ఆరోపించారు. దువ్వాడ నివాసం వద్ద పక్షం రోజుల పాటు ధర్నా చేశారు. రోజుకో ట్విస్ట్ తో ఈ వివాదం నడిచింది. ఇది మరువకముందే ఎమ్మెల్సీ అనంత బాబు వీడియో కాల్ లో అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాల్లో వైసిపి హై కమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడం, క్యాడర్ నుంచి కూడా విన్నపం రావడంతో వైసిపి అతనిపై చర్యలకు ఉపక్రమించింది. అయితే కేవలం ఇంచార్జ్ పదవి నుంచి మాత్రమే తప్పించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అటు అనంత్ బాబు విషయంలో కూడా అదే జరిగింది. వైసీపీ హై కమాండ్ మౌనమే దాల్చింది.
* తక్షణం వేటు
అయితే తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు బయటపడ్డాయి. సొంత పార్టీ మహిళా నేతపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆయనను పట్టించాలన్న ఉద్దేశంతో పెన్ కెమెరాతో రాసలీలను చిత్రీకరించారు బాధితురాలు. అదే విషయాన్ని పార్టీ హైకమాండ్కు తెలియజేశారు. ఆధారాలతో సహా చంద్రబాబుకు లేఖ రాశారు. దీంతో మరో మాట లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు. వైసిపి చేయలేనిది.. తాను చేసి చూపించారు.
* ముందు నుంచి చంద్రబాబు అప్రమత్తం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజలునమ్మకంతో బాధ్యత అప్పగించారని.. దానిని నిలబెట్టుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత మనపై ఉందని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. అటు పవన్ సైతం చాలా రకాలుగా జాగ్రత్తలు చెప్పారు. వైసీపీ నేతల మాదిరిగా వ్యవహరించవద్దని కూడా సూచించారు. అయితే ప్రతి పార్టీలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడం సహజం. అందరూ వ్యక్తిగత వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకోలేం కాబట్టి.. ఆరోపణలు వచ్చిన వెంటనే ఏ పార్టీ అయినా విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో జగన్ వెనుకడుగు వేశారు. చంద్రబాబు ముందంజ వేశారు.
* నాడు పట్టించుకోని జగన్
వైసిపి ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులపై కూడా ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. ఆడియోలు బయటపడ్డాయి. ఓ ఎంపి అసభ్య వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే వీరిపై చర్యలు తీసుకోవడంలో నాడు జగన్ ఉదాసీనంగా వ్యవహరించారు. కనీసం ఖండించలేదు సరి కదా ఏకంగా వారిని వెనుకేసుకొచ్చారు. ఫలితంగా ఆ సంస్కృతి పార్టీలో పెరిగింది. కానీ చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఆదిలోనే తుంచేసే ప్రయత్నం చేశారు. పార్టీపై విమర్శలు రాకుండా చూసుకున్నారు. ఈ విషయంలో మాత్రం జగన్ కంటే చంద్రబాబు బెటర్ గానే ఆలోచన చేసినట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.