YS Jagan Mohan Reddy : వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) దూకుడు పెంచారు. ఎంతలా అంటే అవసరమైతే తమ 11 స్థానాలకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లే దాకా. ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. 164 అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి రాగలిగింది. అయితే వైసిపి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ.. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అందుకే నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసిపి కోరుతోంది. అందుకే అసెంబ్లీ సమావేశాలకు సైతం జగన్ హాజరు కావడం లేదు. అయితే వరుసగా 60 రోజులపాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. అయితే ఇక్కడే వైసిపి గేమ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
* ఆవిర్భావమే ఒక రికార్డ్
2011 మార్చి 11న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని( YSR Congress ) ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విభేదించి 2010 నవంబర్ 29న తన తల్లి విజయమ్మతో పాటు బయటకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత జరిగిన కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల్లో ఏకంగా ఐదు లక్షల 45 వేల 43 ఓట్ల మెజారిటీతో గెలిచారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అటు తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. 17 మంది గెలిచారు. అంటే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు అలానే ఉంది. ఇప్పుడు మరోసారి దానిని రిపీట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
* కాంగ్రెస్ అజయమైన శక్తిగా..
నాడు కాంగ్రెస్ పార్టీ( Congress Party) ఏపీలో అధికారంలో ఉంది. కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ సోనియాగాంధీ నేతృత్వంలో నడుస్తోంది. రెండు చోట్ల కాంగ్రెస్ బలీయమైన శక్తిగా ఉంది. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తెగింపునకు వచ్చారు. తెగువ ప్రదర్శించారు. ఎక్కడికక్కడే సిట్టింగ్ మంత్రులు ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. అధికార దర్పం ప్రదర్శించింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే. కానీ 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న.. బిజెపి సపోర్ట్ చేయడంతో టీడీపీ బయటపడగలిగింది. దానికి జనసేన తోడైంది.
* మూకుమ్మడి రాజీనామాతో
అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గెలిచిన 11 చోట్ల ఉప ఎన్నికకు.. ఆ పార్టీ సిద్ధంగా ఉందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే మునుపటిలా పరిస్థితి ఉందంటే.. అవుననలేం. ఎందుకంటే మూడు పార్టీల మధ్య సమన్వయం ఉంది. భారీ ఓటు శాతంతో కూటమి గెలిచి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమిని నెగ్గుకు రావడం అంత ఈజీ కాదు. పైగా వ్యవస్థలన్నీ వారికి అనుకూలంగా పనిచేస్తాయి. కేంద్రంలో ఉన్న బిజెపి మద్దతు ఉంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదేవిధంగా ఉండేది. కానీ దానిని అధిగమించి రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మరోసారి అటువంటి సాహసం చేసే పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.